ఒకే నిర్మాతతో ప్రభాస్ 3 సినిమాలు… ఎందుకంటే

డార్లింగ్ ప్రభాస్ ఇటీవలే కన్నప్పలో కనిపించి ఆ సినిమా ఓపెనింగ్స్ లో కీలక పాత్ర పోషించడం చూశాం. ఫైనల్ బాక్సాఫీస్ రిజల్ట్ అంచనాలకు తగ్గట్టు రాకపోయినా మంచు విష్ణు కెరీర్ లో హయ్యెస్ట్ నెంబర్స్ నమోదు కావడం వెనుక డార్లింగ్ ఉన్నాడనేది ఓపెన్ ఫాక్ట్. దీని సంగతలా ఉంచితే తాజాగా ఒక ఇంగ్లీష్ మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్ కొన్ని ఆసక్తికరమైన సంగతులు చెప్పుకొచ్చాడు. వాటిలో హోంబాలే ఫిలిమ్స్ యజమాని విజయ్ కిరంగదూర్ గురించి ప్రత్యేక ప్రస్తావన ఉంది. సలార్ తర్వాత ఈ బ్యానర్ లో ప్రభాస్ మరో మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అదెందుకో చెప్పాడు.

విజయ్ కిరంగదూర్ డౌన్ టు ఎర్త్ మనిషి. త్వరగా అందరితో కలిసిపోడు. చిన్ననాటి స్నేహితులతో ఇప్పటికీ అదే బంధాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. ఒకరకంగా చెప్పాలంటే సింపుల్ మ్యాన్. కెజిఎఫ్ షూటింగ్ జరుగుతున్నప్పుడు ఒకసారి సెట్ అగ్ని ప్రమాదానికి గురై కాలిపోయింది. అప్పటికే బడ్జెట్ చాలా ఎక్కువైపోయింది. యూనిట్ లో అందరూ దిగాలుగా ఉండగా విజయ్ వచ్చి డబ్బు గురించి ఆలోచించొద్దు, మనం గొప్ప సినిమా ఇవ్వాలి అంతేనంటూ మళ్ళీ కొత్త సెట్ వేసేందుకు పురమాయించారు. క్వాలిటీ ప్రధానమని ఎప్పుడూ చెప్పే విజయ్ రాజీ పడని మనస్తత్వమే ప్రభాస్ ఏకంగా మూడు సినిమాలు ఒప్పుకునేలా చేసింది.

ఇదంతా డార్లింగ్ స్వయంగా చెప్పుకోవడం విశేషం. యువి తప్ప ప్రభాస్ ఇంకెవరికీ ఇంత ప్రాధాన్యం ఇచ్చిన దాఖలాలు లేవు. హోంబాలే త్వరగా సలార్ 2 శౌర్యంగ పర్వం మొదలుపెట్టాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అయితే ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మరో ప్యాన్ ఇండియా మూవీ ప్లానింగ్ లో ఉందనే ప్రచారం జరుగుతోంది కానీ ప్రొడక్షన్ హౌస్ నుంచి ఇంకా ఎలాంటి క్లారిటీ రావడం లేదు. ది రాజా సాబ్ తో డిసెంబర్ లో ఆడియన్స్ ని పలకరించబోతున్న ప్రభాస్ 2026లో ఫౌజీతో ఆడియన్స్ ముందుకొస్తాడు. ఇంకో రెండు నెలల్లో సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ షూటింగ్ ప్రారంభం కాబోతోందని సమాచారం.