పవన్ కోసం రాజమౌళి రానున్నారా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ‘హరిహర వీరమల్లు’ రిలీజ్ కోసం సుదీర్ఘ కాలంగా సాగుతున్న నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడబోతోంది. ఇప్పటికే మూడుసార్లు రిలీజ్ వాయిదా పడ్డ ఈ చిత్రాన్ని ఈ నెల 24న పక్కాగా రిలీజ్ చేయబోతున్నారు. అందుకోసం సన్నాహాలు జోరందుకున్నాయి. ఇటీవల ట్రైలర్ లాంచ్ చేశాక సినిమాకు పాజిటివ్ బజ్ వచ్చింది. త్వరలోనే ప్రి రిలీజ్ ఈవెంట్ పెద్ద ఎత్తున చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. 

ముందు తిరుపతిలో ఈ ఈవెంట్ చేయాలనుకున్నారు. కానీ ప్రస్తుతం విశాఖపట్నాన్ని వేదికగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. దీంతో పాటుగా హైదరాబాద్‌లోనూ ఒక ఈవెంట్ చేయబోతున్నారు. వీటిలో ఒక దానికి దర్శక ధీరుడు రాజమౌళి ముఖ్య అతిథిగా విచ్చేస్తారన్నది చిత్ర వర్గాల సమాచారం. ఆల్రెడీ రాజమౌళిని ఇందుకోసం అడగడం, ఆయన ఓకే చెప్పడం జరిగిందట.

పవన్ కెరీర్లో చాలా ముఖ్యమైన సినిమా ‘హరిహర వీరమల్లు’. దీనికి ఒకప్పుడు బంపర్ క్రేజ్ ఉండేది. ఐతే బాగా ఆలస్యం కావడం వల్ల హైప్ తగ్గింది. రిలీజ్ టైంకి తిరిగి హైప్ వస్తుందని భావిస్తున్నారు. ఈ లోపు ప్రమోషన్ల పరంగా చేయాల్సిందంతా చేయాలని చూస్తున్నారు. ప్రి రిలీజ్ ఈవెంట్‌కు రాజమౌళి లాంటి దర్శకుడు వచ్చిన మంచి మాటలు చెబితే.. సినిమాకు అది మేలు చేస్తుందని భావిస్తున్నారు. 

పవన్, రాజమౌళిలను ఒకే వేదికపై చూడడం అభిమానులకు కనువిందే. పవన్ గురించి ఎప్పుడు మాట్లాడినా.. అభిమానులకు మంచి హై ఇస్తాడు జక్కన్న. ‘వీరమల్లు’ గురించి కూడా ఆయన అదే స్థాయిలో ఎలివేషన్ ఇస్తాడేమో చూడాలి. మరోవైపు పవన్‌కు అత్యంత సన్నిహితుడైన మరో స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ సైతం ప్రి రిలీజ్ ఈవెంట్లో పాల్గొనే అవకాశమున్నట్లు తెలుస్తోంది.