రజినీకాంత్ చమత్కారానికి ఫిదా కావాల్సిందే

సినిమాల్లో స్టైల్, స్వాగ్ తో కట్టిపడేసే సూపర్ స్టార్ రజనీకాంత్ సరైన సందర్భం దొరకాలే కానీ తనలో కామెడీ టైమింగ్ ని బ్రహ్మాండంగా బయటికి తీస్తారు. ఇటీవలే చెన్నైలో జరిగిన వేల్పరి లక్ష కాపీల ఈవెంట్ లో ఆయనన్న మాటలకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఆ మధ్య ఒక వేడుకలో తాను అన్న మాటలు కొంత వివాదానికి దారి తీశాయని, ఇలాంటి సభలకు కమల్ హాసన్ లేదా శివ కుమార్ (సూర్య తండ్రి) లాంటి వాళ్ళను పిలవాలి కానీ 75 ఏళ్ళ వయసులో స్లో మోషన్ లో నడుచుకుంటూ వచ్చే తనను ఎందుకు ఆహ్వానించారని చెప్పడంతో ఒక్కసారిగా ఘొల్లుమనడం ఆహుతుల వంతయ్యింది.

తన తోటి నటీనటులను మేధావులుగా పేర్కొనడం రజనికే చెల్లింది. ఇకపై తొందరపడనని ఆచితూచి మాట్లాడతానని చెప్పడం సంస్కారానికి నిదర్శనం. వేల్పరి నవలను పాతిక శాతం పూర్తి చేశానని చెప్పిన తలైవర్ మిగిలింది రెటైర్ మెంట్ తర్వాత చదువుతానని చెప్పడం కొసమెరుపు. ఈ వేల్పరినే దర్శకుడు శంకర్ వెయ్యి కోట్ల బడ్జెట్ తో మూడు భాగాలుగా తీయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ ఇండియన్ 2, గేమ్ ఛేంజర్ ఫలితాల వల్ల ఇప్పుడే నిర్మాత ఆయన మీద అంత ఖర్చు పెట్టేందుకు సాహసించడు. ఒకవేళ రజని కమల్ లాంటి హీరోలు ఒప్పుకుంటే ఛాన్స్ ఉందేమో కానీ ఈ కాంబో సాధ్యం కాదు.

ఆగస్ట్ 14 విడుదల కాబోతున్న కూలి కోసం రజని అభిమానులే కాదు సగటు ప్రేక్షకులు కూడా విపరీతమైన ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. జైలర్ రికార్డులను డబుల్ మార్జిన్ తో బద్దలు కొడతారని నమ్మకంతో ఉన్నారు. వార్ 2 తో క్లాష్ ఉన్నప్పటికీ కూలి క్రేజ్ చాలా ఎక్కువగా ఉంది. తెలుగు హక్కులే యాభై కోట్లకు పైగా అమ్ముడుపోవడమే దానికి నిదర్శనం. కూలి పూర్తి కావడం ఆలస్యం జైలర్ 2లో బిజీగా మారిపోయిన రజనీకాంత్ ఆ తర్వాత చేయబోయే సినిమా దర్శకులను ఇంకా లాక్ చేయలేదు. కథా చర్చలైతే జరుగుతున్నాయి కానీ నెక్స్ట్ ఎవరితో అనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు.