చిరంజీవి హ్యాపీ… విశ్వంభర వస్తోంది

మెగాభిమానులు ఎదురు చూసి చూసి అలిసిపోయిన విశ్వంభర ఎట్టకేలకు మేలుకొలుపు అందుకుంది. ఇటీవలే విఎఫెక్స్ వర్క్ పూర్తి చేసుకున్న 45 నిమిషాల ఫుటేజ్ ని చూసిన చిరంజీవి పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారని, త్వరలోనే బ్యాలన్స్ ఉన్న ఐటెం సాంగ్ తో పాటు చిన్న ప్యాచ్ వర్క్ పూర్తి చేసేందుకు డేట్లు ఇస్తానని చెప్పడంతో దర్శకుడు వశిష్ట ఆ ఏర్పాట్లలో ఉన్నారు. ప్రాధమికంగా ఉన్న సమాచారం ప్రకారం సెప్టెంబర్ 18 డేట్ లాక్ చేసే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. సెప్టెంబర్ 25 పవన్ కళ్యాణ్ ఓజి వచ్చినా రాకపోయినా ఈ నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండబోదని యూనిట్ వర్గాల నుంచి వినిపిస్తున్న మాట.

ఇది ఫ్యాన్స్ కి శుభవార్తే. వీలైనంత త్వరగా ఫ్రెష్ గా ప్రమోషన్లు చేపట్టాలి. ఆగస్ట్ 22 మెగాస్టార్ బర్త్ డే వస్తోంది. టీజర్ కొచ్చిన డ్యామేజ్ ని పూర్తిగా మాన్పాలంటే విశ్వంభర ట్రైలర్ ని మైండ్ బ్లోయింగ్ అనే స్థాయిలో కట్ చేయించాలి. అటువైపు అనిల్ రావిపూడి తన మెగా 157 టైటిల్ రివీల్ ని అదే రోజు చేయాలని ప్లాన్ లో ఉన్నారట. అదే జరిగితే అప్డేట్స్ పరంగా మెగా 157దే పై చేయి అయ్యే రిస్క్ లేకపోలేదు. అయితే విశ్వంభర టీజర్ ఫైనల్ కట్ సిద్ధమయ్యే దాకా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవచ్చు. మౌని రాయ్ డాన్స్ చేయబోతున్న స్పెషల్ సాంగ్ ని రీమిక్స్ కాకుండా భీమ్స్ కొత్త ట్యూన్ సిద్ధం చేసినట్టు లేటెస్ట్ అప్డేట్.

ఇక్కడిదాకా అంతా బాగానే ఉంది కానీ ఇకపై యువి క్రియేషన్స్ మీద పెద్ద బాధ్యత ఉంది. వినూత్న పబ్లిసిటీతో ఆడియన్స్ చూపు దీనివైపు వచ్చేలా చేయాలి. రాముడి మీద వదిలిన లిరికల్ సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది కానీ ఆశించిన స్థాయిలో వైరల్ కాలేదు. కీరవాణి మంచి పాటలు ఇచ్చారనే టాక్ కి తగట్టు ఆడియో హిట్ అయితే బజ్ పరంగా విశ్వంభరకు హెల్ప్ అవుతుంది. ప్యాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేసుకున్న ఈ మెగా మూవీలో త్రిష హీరోయిన్ కాగా ఆశికా రంగనాథ్ కీలక పాత్ర పోషిస్తోంది. విజువల్ ఎఫెక్ట్స్ కు సంబంధించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం వల్ల అవుట్ ఫుట్ చాలా బాగా వచ్చిందని టాక్.