ఈ మధ్య కోలీవుడ్ ఫిలిం మేకర్స్ ఎమోషనల్ డ్రామాల మీద ఎక్కువ దృష్టి పెట్టి మంచి ఫలితాలు అందుకుంటున్నారు. ఆ మధ్య టూరిస్ట్ ఫ్యామిలీ తమిళనాడులో ఎంత పెద్ద హిట్టయ్యిందో చూశాం. సూర్య రెట్రోతో పాటు రిలీజై దాన్ని పూర్తిగా పక్కకు నెట్టేసి మరీ ఎనభై కోట్లు వసూలు చేసిన మూవీగా దీనికొచ్చిన ప్రశంసలు చాలానే ఉన్నాయి. తెలుగు డబ్బింగ్ థియేటర్లో రాకపోయినా హాట్ స్టార్ పుణ్యమాని మన ఆడియన్స్ ఓటిటిలో చూసేశారు. దీని దర్శకుడు అభిషన్ జీవింత్ ఇప్పుడు ఏకంగా హీరోగా నటించే స్థాయికి చేరుకున్నాడు. ఇదే కోవలో ఇటీవలే 3 BHK రిలీజయ్యింది. సిద్దార్థ్ ఉండటంతో టాలీవుడ్ అనువాదం వచ్చింది.
స్వంతంగా ఒక మూడు పడకల ఇల్లు స్వంతం చేసుకోవాలనే లక్ష్యం పెట్టుకున్న ఒక మధ్య తరగతి కుటుంబం భావోద్వేగాల చుట్టూ దర్శకుడు శ్రీగణేష్ ఈ సినిమాని నడిపించారు. సిద్దార్థ్, శరత్ కుమార్, దేవయాని ఇలా సీనియర్ క్యాస్టింగ్ ని పెట్టుకుని సింపుల్ స్టోరీని కాంప్లికేషన్ లేకుండా నడిపించిన వైనం బాగానే ఆకట్టుకుంటోంది. స్లో పేస్, డ్రామాపాళ్ళు కొంచెం ఎక్కువైపోవడం లాంటి కారణాలు కొంత మైనస్ గా ఉన్నప్పటికీ తీవ్రంగా నిరాశ పరచకపోవడంతో ప్రేక్షకులు పాస్ మార్కులు ఇస్తున్నారు. చెన్నై ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం 3 BHK ఇప్పటిదాకా ఆరు కోట్లకు పైగా వసూలు చేసింది. భారీ కాదు కానీ ఇది డీసెంట్ నెంబర్.
ఇప్పుడీ వారంలో చెప్పుకోదగ్గ భారీ రిలీజులు లేకపోవడంతో 3 BHK ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి. మన దగ్గర బలగం తర్వాత మళ్ళీ ఆ స్థాయిలో ఎమోషనల్ డ్రామాలు రాలేదు. విజువల్ గ్రాండియర్లు, ప్యాన్ ఇండియా సినిమాలతో పాటు ఈ తరహా సినిమాలు వస్తే ప్రేక్షకుల ఆదరణ ఖచ్చితంగా ఉంటుంది. ఎలివేషన్లకు దూరంగా ఉండే ఈ ప్రపంచాన్ని ఇష్టపడే కుటుంబ ప్రేక్షకులు థియేటర్లకు వస్తారు. అయితే టూరిస్ట్ ఫ్యామిలీ స్థాయిలో అద్భుతాలు చేస్తుందనుకున్న 3 BHK సోమవారం నుంచి ఎక్కువ డ్రాప్ నమోదు చేస్తోంది. దీన్ని త్వరగా పికప్ చేసుకోగలిగితే సిద్దార్థ్ కెరీర్ లో చాలా గ్యాప్ తర్వాత హిట్టు పడ్డట్టే.
Gulte Telugu Telugu Political and Movie News Updates