చిత్రం చూశారా.. తల్లితో నటి ప్రెగ్నెన్సీ షూట్

తెలుగు బిగ్ బాస్ షోను ఫాలో అయిన వాళ్లకు ప్రియాంక జైన్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగమ్మాయి కాకపోయినా.. ఈ షో ద్వారా.. తను చేసే సీరియళ్లు, టీవీ షోల ద్వారా మన వాళ్లకు బాగానే చేరువ అయింది ప్రియాంక. ఇటీవలే 27వ పుట్టిన రోజును జరుపుకున్న ప్రియాంక.. ఆ సందర్భంగా తన చెప్పుపై కేకును పెట్టి ఫొటోలకు పోజులివ్వడం వివాదాస్పదం అయింది. కట్ చేస్తే.. ఇప్పుడు ఒక ఆసక్తికర వీడియోతో ఆమె ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

తన తల్లికి ఆమె ప్రెగ్నెన్సీ ఫొటో షూట్ చేయడం విశేషం. ప్రియాంక వయసే 27 ఏళ్లు. అలాంటిది ఈ వయసులో తల్లికి ప్రెగ్నెన్సీ ఫొటో షూట్ చేయడం ఏంటి అని ఆశ్చర్యం కలగొచ్చు. కానీ ఇది నిజం. ఆమె వయసు ఎంతో ఏమో కానీ.. నిండు గర్భిణిగా ఉన్న తన తల్లికి ప్రియాంక ఫొటో షూట్ చేయడమే కాక.. సంబంధిత వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ వీడియోను ప్రియాంక బాయ్ ఫ్రెండ్ శివకుమార్ షూట్ చేయడం విశేషం.

తన తల్లి 27 ఏళ్ల కిందట తొలిసారి తల్లి అయిందని… అప్పుడు తాను ఆమె కడుపులో ఉన్నానని.. ఆ సమయంలో తన తల్లి ఎలా ఫీలైంది ఇప్పుడు చూడబోతున్నానని.. ఇది అరుదైన విషయమని ప్రియాంక పేర్కొంది. తన తల్లి ఈ వయసులో ఎందుకు తల్లి అవుతోందని.. దీని వెనుక నేపథ్యం ఏంటి అన్నది ప్రియాంక వెల్లడించలేదు. తన తల్లికి సీమంతం కూడా చేయలేదని.. అందుకే ఇలా ఫొటో షూట్ ప్లాన్ చేశానని ఆమె చెప్పింది. తన కూతురు ఇలా ప్రెగ్నెన్సీ షూట్ చేయడం పట్ల ప్రియాంక తల్లి చాలా ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇంతకీ నువ్వెప్పుడు పిల్లల్ని కంటావు అని శివకుమార్ ఈ సందర్భంగా ప్రియాంకను అడగ్గా.. పెళ్లి చేసుకున్నాక, అది ఎప్పుడు అవుతుందా అని ఎదురు చూస్తున్నాను అని ప్రియాంక పేర్కొంది.