టాక్సిక్… అనిరుధ్ నెగిటివ్ సెంటిమెంట్ మార్చాల్సిందే

కెజిఎఫ్ తర్వాత యష్ నటిస్తున్న ప్యాన్ ఇండియా మూవీగా టాక్సిక్ మీద భారీ అంచనాలున్నాయి. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మాఫియా కం గ్యాంగ్ స్టార్ డ్రామా మీద మూడు వందల కోట్లకు పైగా ఖర్చు పెడుతున్నారని శాండల్ వుడ్ టాక్. వచ్చే సంవత్సరం మార్చి 19 విడుదలకు రెడీ అవుతున్న టాక్సిక్ కు సంగీత దర్శకుడిగా అనిరుధ్ రవిచందర్ ఎంపికైనట్టు లేటెస్ట్ అప్డేట్. అధికారికంగా ప్రకటించలేదు కానీ ఏ నిమిషమైనా ఆ లాంఛనం జరిగిపోవచ్చని తెలిసింది. అంతా బాగానే ఉంది కానీ నెగటివ్ సెంటిమెంట్ అని హెడ్డింగ్ లో ఉందేమనే డౌట్ వస్తోందా. అక్కడికే వద్దాం.

అనిరుధ్ కి ఇది తొలి కన్నడ సినిమా. ఇతను ఇతర భాషల్లో తెరంగేట్రం చేసిన సినిమాలు డిజాస్టరయ్యాయి. తమిళ మొదటి సినిమా ధనుష్ 3 ఎంత పెద్ద ఫ్లాపో చెప్పనక్కర్లేదు. తర్వాత కల్ట్ స్టేటస్ తెచ్చుకుంది కానీ కమర్షియల్ గా ఫెయిల్యూర్ కిందకు వస్తుంది. హిందీలో తొలి అడుగు డేవిడ్ తో పడింది. కంపోజ్ చేసింది ఒక పాటే అయినా ఆడలేదు. ఫుల్ లెన్త్ ఆల్బమ్ ఇచ్చిన షాహిద్ కపూర్ జెర్సీ ఇంకా దారుణంగా పోయింది. తెలుగులో పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసితో అనిరుద్ మనకు పరిచయమయ్యాడు. రెండు మూడు పాటలు జనాలకు ఎక్కాయి కానీ సినిమా ఎప్పటికీ మర్చిపోలేని అల్ట్రా డిజాస్టరయ్యింది.

ఇప్పుడు శాండల్ వుడ్ లో అడుగు పెడుతున్నాడు. అది కూడా టాక్సిక్ లాంటి క్రేజీ మూవీతో. మరి నెగటివ్ సెంటిమెంట్ ని ఏ మేరకు బ్రేక్ చేస్తాడో చూడాలి. టాక్సిక్ విడుదలకు ఇంకా పది నెలలకు పైగా సమయం ఉంది. షూటింగ్ సగం దాకా అయ్యింది. హీరోయిన్ కియారా అద్వానీతో పాటు నయనతార ఇందులో ఓ కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. గోవా నేపథ్యంలో ఇంతకు ముందు ఎన్నడూ చూడని యాక్షన్ బ్యాక్ డ్రాప్ ప్రేక్షకులను థ్రిల్ ఇస్తుందని యూనిట్ చెబుతోంది. కేవలం పది రోజుల గ్యాప్ లో లవ్ అండ్ వార్, ది ప్యారడైజ్, పెద్దిలతో టాక్సిక్ కి అన్ని భాషల్లో చాలా పెద్ద పోటీ స్వాగతం చెప్పబోతోంది.