సినిమాల కలెక్షన్లు మాత్రమే కాదు.. వాటి టీజర్లు, ట్రైలర్లకు యూట్యూబ్‌లో వచ్చే వ్యూస్, లైక్స్ కూడా ఫేక్‌గా మారిపోయిన రోజులు ఇవి. ప్రమోషన్ల టైంలో సినిమా కోసం ప్రేక్షకులు ఊగిపోతున్నట్లుగా ఒక భ్రమ కల్పించడానికి నిర్మాతలు డబ్బులు ఖర్చు పెట్టుకుని చేసే ఫేక్ ప్రచారాలు ఈ మధ్య విసుగు పుట్టించేస్తున్నాయి. ఇక సినిమా రిలీజ్ రోజు వదిలే కలెక్షన్ల పోస్టర్లు, పెట్టే ప్రెస్ మీట్ల సంగతి సరేసరి.
ఈ ఒరవడి రోజు రోజుకూ శ్రుతి మించి జనాలు దేన్నీ నమ్మలేని పరిస్థితి వచ్చేసింది. ఈ నేపథ్యంలో అగ్ర నిర్మాత దిల్ రాజు ఇటీవల కఠిన నిర్ణయం తీసుకున్నారు. తన సినిమాల ప్రోమోలకు వ్యూస్, లైక్స్ కోసం డబ్బులు పెట్టడం మానేశారు. అంతే కాక కలెక్షన్ల విషయంలోనూ ఇకపై ఫేక్ ప్రచారాలు వద్దని నిర్ణయించుకున్నారు. ‘గేమ్ చేంజర్’ సినిమా డే-1 కలెక్షన్ల పోస్టర్ ఎంత దుమారం రేపిందో తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ‘తమ్ముడు’ సినిమా నుంచి ఆయన ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు.
‘తమ్ముడు’ సినిమా రెండు ట్రైలర్లకు యూట్యూబ్‌లో వచ్చిన వ్యూస్, లైక్స్ అన్నీ ఒరిజినలే. నితిన్ గత చిత్రం ‘రాబిన్ హుడ్’కు వచ్చిన వ్యూస్, లైక్స్‌లో ‘తమ్ముడు’కు నాలుగో వంతు కూడా రాకపోవడం గమనార్హం. దీన్ని బట్టే ‘తమ్ముడు’కు వచ్చిన వ్యూస్, లైక్స్ అన్నీ ఒరిజినల్ అన్నది స్పష్టం. ఇదే ఒరవడిని ‘తమ్ముడు’ రిలీజ్ రోజు కూడా కొనసాగించారు రాజు. సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చింది.
తొలి రోజు వసూళ్లు అంచనాలకు తగ్గట్లు లేవు. డే-1 వరల్డ్ వైడ్ ఈ చిత్రం రూ.4 కోట్ల గ్రాస్ మాత్రమే కలెక్ట్ చేసింది. మీడియాకు కలెక్షన్ల గురించి ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. వసూళ్లను పెంచి పోస్టర్ రిలీజ్ చేయలేదు. అన్నింటికీ మించి సినిమా బ్లాక్ బస్టర్ అంటూ ‘తమ్ముడు’ టీం ప్రెస్ మీట్ పెట్టకపోవడం గమనార్హం.
ఈ రోజుల్లో సినిమా ఎంత పెద్ద డిజాస్టర్ అయినా ఆహా ఓహో అంటూ సాయంత్రానికి సక్సెస్ మీట్ పెట్టి హోరెత్తించేస్తుంటారు. సినిమా ఫలితం ఏంటన్నది పక్కన పెడితే.. రాజు నిజాయితీ ఇప్పుడు ప్రశంసలు అందుకుంటోంది. ఈ విషయంలో ఇండస్ట్రీ అంతా రాజును ఫాలో అవ్వాల్సిన అవసరముంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates