తెలుగు హీరోల ఫ్యాన్స్ ఒక్కటయ్యారు

తెలుగు సినిమా హీరోల ఫ్యాన్స్ సోషల్ మీడియాలో నిత్యం ఎలా గొడవలు పడుతుంటారో తెలిసిందే. చిత్ర విచిత్రమైన టాపిక్స్ తీసుకుని, కారణాలు వెతుక్కుని సోషల్ మీడియాలో ఎడతెగని విధంగా కొట్లాడేసుకుంటూ ఉంటారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు హీరోల ఫ్యాన్స్ మధ్య కూడా తీవ్ర స్థాయిలో ఘర్షణలు జరుగుతుంటాయి. తరతరాల వైరం ఉన్నట్లు పరస్పరం దూషించుకునే తీరు చూస్తే ఆశ్చర్యం కలగక మానదు.

ఐతే ఇంతలా గొడవ పడే ఫ్యాన్స్ ఇప్పుడు ఉన్నట్లుండి కలిసిపోయారు. అలా అని వాళ్లు ఫ్యాన్ వార్స్ ఆపేసి.. ప్రశాంతంగా ఉన్నారనుకుంటే పొరపాటే. అందరూ కలిసి వేరే సినీ పరిశ్రమకు చెందిన ఒక హీరో అభిమానులతో గొడవకు దిగారు. ఆ హీరో ఎవరో కాదు.. శాండిల్ వుడ్ స్టార్ దర్శన్. ఆ హీరో ఫ్యాన్స్ పుణ్యమా అని.. మన హీరోల అభిమానులందరూ ఒక్కటైపోయి యుద్ధంలోకి దిగిపోయారు.

కన్నడ టాప్ స్టార్లలో ఒకడైన దర్శన్.. గత ఏడాది తన అభిమానినే హత్య చేసిన కేసులో జైలు పాలై, కొన్ని నెలల తర్వాత బయటికి వచ్చిన సంగతి తెలిసిందే. ఐతే దర్శన్ ఫ్యాన్స్‌ మాత్రం తమ హీరో ఏం చేసినా ఒప్పే అంటారు. ఈ కేసు విషయంలోనూ అతణ్ని సమర్థిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే తమ హీరో మళ్లీ సినిమాలకు రెడీ అవుతుండడం గురించి కొందరు ఫ్యాన్స్ పోస్టులు పెట్టారు. దీని మీద మన తెలుగు నెటిజన్లు స్పందించారు. హత్య చేసిన వ్యక్తికి ఈ ఎలివేషన్లు ఏంటి అంటూ విమర్శలు చేశారు. అది దర్శన్ ఫ్యాన్స్‌కు నచ్చలేదు. వాళ్లు ఎదురుదాడికి దిగారు. తెలుగు హీరోలను, వారి ఫ్యాన్స్‌ను బూతులు తిట్టారు.

మన వాళ్లూ ఏమీ తగ్గలేదు. దర్శన్ ఫ్యాన్స్ మన హీరోలను డీగ్రేడ్ చేస్తూ, బూతులు తిడుతూ పోస్టులు పెడుతుంటే.. ఇక్కడి ఫ్యాన్స్ అందరూ తమ మధ్య ఉన్న గొడవలన్నీ పక్కన పెట్టి దర్శన్ ఫ్యాన్స్‌ను ఢీకొనడం మొదలుపెట్టారు. పరస్పరం దారుణమైన హ్యాష్ ట్యాగ్స్ పెట్టి వాటిని ట్రెండ్ చేస్తున్నారు. ఇవి నేషనల్ లెవెల్లో ట్రెండ్ అవుతున్నాయి. ఒక రోజంతా గొడవ పడ్డా ఈ ఫ్యాన్స్‌ అలసిపోలేదు. మళ్లీ రేపు కొత్త హ్యాష్ ట్యాగ్స్ పెట్టి ట్రెండ్ చేస్తాం, మీ సంగతేంటో తేలుస్తాం అంటూ సవాళ్లు విసురుకోవడం విశేషం.