OG మీద కొత్త ప్రచారం ఎందుకొచ్చింది

విడుదల తేదీలో ఎలాంటి మార్పు ఉండదని డివివి ఎంటర్ టైన్మెంట్స్ తరచుగా స్పష్టం చేస్తున్నప్పటికీ OG వాయిదా ప్రచారాలు ఆగడం లేదు. సెప్టెంబర్ 25 ఎప్పుడెప్పుడు వస్తుందాని అభిమానులు ఎదురు చూస్తున్నారు. హరిహర వీరమల్లు కన్నా దీని మీదే బజ్ ఎక్కువగా ఉన్న మాట నిజమే. అయితే పోస్ట్ పోన్ గురించి కొత్తగా ప్రచారం ఎందుకు మొదలయ్యిందనే కోణంలో విచారణ చేస్తే పలు ఆసక్తికరమైన విషయాలు బయటికి వస్తున్నాయి. విశ్వంభర విఎఫ్ఎక్స్ వ్యవహారం ఒక కొలిక్కి వస్తోందట. చిరంజీవి సంతృప్తి పడేలా ఫైనల్ కాపీ సిద్ధమయ్యిందని, ఆయన చూడటమే బాకీ అనే వార్త ఆల్రెడీ బయటికొచ్చింది.

జూలై, ఆగస్ట్ లో విశ్వంభర రిలీజ్ చేసే ఛాన్స్ లేదు. కానీ సెప్టెంబర్ లో ఓజి ఉంది. ఒకవేళ ఇది కనక తప్పుకునే పక్షంలో ఆ డేట్ ని విశ్వంభర తీసుకోవచ్చనే ఆలోచనలో యువి క్రియేషన్స్ లో ఉంది. అయితే ఓజి అంత సులభంగా వెనక్కు తగ్గే సూచనలు లేవు. కానీ ఇక్కడో చిక్కు ఉంది. చేతిలో కేవలం రెండు నెలల టైం ఉంది. దీంట్లోనే పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేయడంతో పాటు తమన్ రీ రికార్డింగ్, ప్రీ రిలీజ్ ఈవెంట్, ప్రమోషన్లు అన్నీ చేసేయాలి. ఓజికి ప్రత్యేకంగా పబ్లిసిటీ అక్కర్లేకపోయినా ఇప్పుడున్న మార్కెటింగ్ పరిస్థితుల్లో సాధారణ ప్రేక్షకుల్లో హైప్ పెంచడం కోసం ఇవి చేయక తప్పదు.

ఈ సమయం సరిపోకపోవచ్చనే అంచనా డివివి బృందంలో ఉందట. ముందైతే సెప్టెంబర్ 25కే కట్టుబడి ఆ మేరకు పనులు స్పీడప్ చేసినట్టు తెలిసింది. పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఇప్పటిదాకా కేవలం రెండు నెలల గ్యాప్ లో రెండు కొత్త సినిమాలు రిలీజ్ కావడం ఎప్పుడూ జరగలేదు. జూలై 24 హరిహర వీరమల్లు, సెప్టెంబర్ 25 ఓజి కనక వస్తే ఒక కొత్త రికార్డు నమోదు చేసినట్టు అవుతుంది. అయితే పవన్ లాంటి టయర్ 1 హీరో ఇంత తక్కువ నిడివిలో రావడం అంత సేఫ్ కాదనేది ట్రేడ్ లో వినిపిస్తున్న కామెంట్. ఏ నిమిషానికి ఏమి జరుగునో పాట తరహాలో మాటకు కట్టుబడటాలు, వాయిదాల గురించి వెంటనే నిర్ధారణకు రాలేం.