ఇవాళ హైదరాబాద్ ప్రసాద్ మల్టీప్లెక్సులో రామాయణ టైటిల్ అనౌన్స్ మెంట్ టీజర్ విడుదల చేశారు. ప్రత్యేకంగా 3డి ఎఫెక్ట్ లో చూపించడంతో మీడియాతో పాటు ఆడియన్స్ థ్రిల్ అయ్యారు. మూడు నిమిషాల వీడియో అయినప్పటికీ నిజానికిది టీజర్ కాదు. క్రూని టైటిల్ కార్డ్స్ ద్వారా పరిచయం చేస్తూ చివర్లో రన్బీర్ కపూర్, యాష్ లను వేర్వేరు షాట్లలో రివీల్ చేయడంతో ముగించారు. థియేటర్ ఎక్స్ పీరియన్స్ డిఫరెంట్ గా ఉంది కానీ స్మార్ట్ ఫోన్, టీవీలో చూసినప్పుడు మరీ అంత స్పెషల్ అనిపించదు. హాన్స్ జిమ్మర్, ఏఆర్ రెహమాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయే సౌండ్స్ తో మంచి అనుభూతి కలిగించింది.
అయితే రామాయణ ఒక్క షాట్ అంచనాలు పెంచిందా అంటే వెంటనే ఔనని చెప్పలేం. ఎందుకంటే ఈ ఇతిహాస గాథను పరిచయం చేసిన తీరు బాగుంది కానీ అసలైన అవగాహన రావాలంటే ఇంకొంచెం వెయిట్ చేయాలి. టీజర్ వస్తే కానీ ఏదీ చెప్పలేం. ఇప్పుడు అందరి చూపు దర్శకుడు నితేశ్ తివారి మీద ఉంది. ఆదిపురుష్ వచ్చినప్పుడు ఓం రౌత్ మీద ఎన్ని విమర్శలు వచ్చాయో తెలిసిందే. వాటిని దృష్టిలో పెట్టుకుని రామాయణలో ఎలాంటి పొరపాట్లకు తావు ఇవ్వకుండా చూసుకుంటున్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ విఎఫ్ఎక్స్ కంపెనీలు దీనికి వర్క్ చేయడంతో పాటు నిర్మాణ భాగస్వామ్యంలోనూ ఉన్నాయి.
వచ్చే సంవత్సరం దీపావళి విడుదల కాబట్టి పోస్ట్ ప్రొడక్షన్ కు బోలెడు సమయముంది. రావణుడిగా యష్ నటించడం ఒక ఆకర్షణగా కాగా సీతగా సాయిపల్లవి పెర్ఫార్మన్స్ గురించి బెస్ట్ ఆశించవచ్చు. సన్నీ డియోల్ ఆంజనేయుడిగా నటించడం హైప్ పెంచే మరో విషయం. ఏడాది గ్యాప్ లో రామాయణ రెండు భాగాలూ వచ్చేస్తాయి. సీతాపహరణంతో పార్ట్ 1 ముగిస్తే సీత అశోకవనంకు వెళ్లినప్పటి నుంచి రామ రావణ యుద్ధం దాకా పార్ట్ 2 లో ఉంటుందని ముంబై టాక్. ఏడాది ముందు నుంచే ప్రమోషన్లు మొదలుపెట్టిన రామాయణ టీమ్ సాయిపల్లవి ఇంట్రోని విడిగా లాంచ్ చేస్తుందట.
Gulte Telugu Telugu Political and Movie News Updates