బాలీవుడ్ లెజెండరీ నటుడు నసీరుద్దీన్ షా.. ఇప్పుడో పెద్ద వివాదంలో చిక్కుకున్నారు. ఆయన పెట్టిన సోషల్ మీడియా పోస్టు దుమారం రేపింది. నెటిజన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆ పోస్టును నసీరుద్దీన్ తొలగించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంతకీ ఏం జరిగిందంటే…?
ప్రముఖ పంజాబీ నటుడు, సింగర్ దిల్జిత్ దోసాంజ్ హీరోగా తెరకెక్కిన ‘సర్దార్జీ-3’ చిత్రంలో పాకిస్థానీ నటి హనియా ఆమిర్‌ను కథానాయికగా తీసున్నారు. ఇది గత ఏడాది జరిగిన విషయం. ఐతే కొన్ని నెలల కిందట పహల్గాం ఉగ్రదాడి తర్వాత జరిగిన పరిణామాలు తెలిసిందే. పాకిస్థాన్ నటులు నటించిన సినిమాలను మన వాళ్లు బాయ్‌కాట్ చేస్తున్నారు. అవి విడుదల కాకుండా అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలోనే ‘సర్దార్జీ-3’ మీద వ్యతిరేకత వచ్చింది. ఐతే ఉద్రిక్త పరిస్థితులకు ముందు తీసుకున్న నిర్ణయాలపై ఇప్పుడేం చేయగలమని టీం అంటోంది.
దిల్జీత్ అండ్ టీంకు మద్దతుగా కొందరు గళం విప్పుతున్నారు. నసీరుద్దీన్ షా సైతం ఇదే తరహాలో ఒక పోస్టు పెట్టారు. దర్శకుడు తీసుకున్న నిర్ణయానికి దిల్జీత్ మీద సోషల్ మీడియాలో జరుగుతున్న దాడిని ఆయన తప్పుబట్టారు. ఇదంతా ఒక జుమ్లా పార్టీ చేస్తున్న డర్టీ ట్రిక్స్ అంటూ ఆయన విరుచుకుపడ్డారు. వీళ్లు ఇండియా, పాకిస్థాన్ ప్రజల మధ్య వ్యక్తిగత సంబంధాలు ఉండొద్దని కోరుకుంటున్నారని.. కానీ తన పాకిస్థాన్ స్నేహితులను కలవకుండా, వారికి తన ప్రేమను పంచకుండా ఎవ్వరూ ఆపలేరని ఆయన వ్యాఖ్యానించారు.
అంతే కాక.. తనను పాకిస్థాన్‌కు వెళ్లమని అనే వాళ్లకు ‘కైలాసానికి వెళ్లండి’ అన్నదే తన సమాధానం అంటూ ఘాటుగా ఈ పోస్టును ముగించారు. ఐతే ఈ పోస్టు తర్వాత నసీరుద్దీన్ మీద సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో ఎటాక్ మొదలైంది. పాకిస్థాన్‌ను ఇంతగా ప్రేమించే నసీరుద్దీన్ సినిమాలన్నింటినీ బాయ్‌కాట్ చేయాలంటూ పిలుపునిచ్చారు. మరీ ఈ స్థాయిలో ఎదురుదాడి ఉంటుందని నసీరుద్దీన్ ఊహించలేకపోయారు. ఇది చూసి భయపడ్డ నసీరుద్దీన్ పోస్టును డెలీట్ చేయాల్సి వచ్చింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates