పవన్ పెద్ద మనసు.. కమెడియన్‌కు సాయం

సినిమాల్లో ఉన్నపుడైనా, రాజకీయాల్లోకి వచ్చాక అయినా పవన్ కళ్యాణ్ ఎవరినైనా చూసి చలించాడంటే అంతే.. లక్షల రూపాయలు.. అవసరమైతే కోట్లు కూడా సాయం ప్రకటించడానికి వెనుకాడడు. ఇలా పవన్ ఎంత సాయం చేశాడో లెక్కలేసి చెప్పడం కష్టం. ఈ మధ్యే ఆంధ్రప్రదేశ్‌లో కొణిదెల అనే గ్రామానికి సొంత నిధుల నుంచి రూ.50 లక్షల సాయం ప్రకటించిన తన పెద్ద మనసును చాటాడు. తాజాగా ఆయన సీనియర్ కమెడియన్ వాసుకి అలియాస్ పాకీజాకు ఆర్థిక సాయం ప్రకటించారు. పవన్ అందించిన రూ.2 లక్షల సాయాన్ని జనసేన పార్టీ తరఫున నేతలు.. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో పాకీజాకు అందజేశారు. 

‘అసెంబ్లీ రౌడీ’ సహా పలు చిత్రాల్లో నటించి 90వ దశకంలో ఒక వెలుగు వెలిగిన పాకీజా.. కొన్నేళ్లుగా దీన స్థితిలో ఉన్నారు. ఆమెకు భర్త, పిల్లలు ఎవ్వరూ లేరు. తనను పట్టించుకునే వారు లేక.. రోజు వారీ ఖర్చులకు కూడా కష్టమవుతోందని.. సరైన తిండి కూడా తినలేకపోతున్నానని ఇటీవల పాకీజా ఒక వీడియో ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు.

చెన్నైలో ఉండలేక ఏపీకి వచ్చేశానని.. విజయవాడకు వెళ్లి సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లను కలిసే ప్రయత్నం చేశానని.. కానీ అపాయింట్మెంట్ దొరకలేదని పాకీజా ఆ వీడియోలో పేర్కొన్నారు. ఐతే విషయం తన వరకు రాగానే పవన్ స్పందించి సాయం అందించారు. దీనిపై పాకీజా ఉద్వేగభరితంగా స్పందించారు. చిన్నవాడైనా ఎదురుగా ఉంటే పవన్ కాళ్లు మొక్కేదాన్నని అన్నారు. పవన్ కళ్యాణ్ కుటుంబానికి జీవితాంతం రుణపడి ఉంటానని ఆమె చెప్పారు.