కన్నప్ప దూకుడుకి బ్రేక్ పడిందా

అనుమానపడినట్టే నిన్న సోమవారం పరీక్షలో కన్నప్ప తడబడ్డాడు. వీక్ డేస్ లో నెమ్మదించడం ప్రతి సినిమాకు సహజమే అయినా మంచు విష్ణుకి డ్రాప్ శాతం ఎక్కువ ఉందనేది బుకింగ్స్ లో తేటతెల్లమవుతోంది. బిసిలోనే కాదు ఏ సెంటర్స్ లోనూ వసూళ్లు తగ్గాయని ట్రేడ్ నుంచి వస్తున్న రిపోర్ట్. ఇప్పటిదాకా బుక్ మై షోలో అయిదు లక్షల టికెట్లు అమ్మిన కన్నప్ప ఇకపై దూకుడు కొనసాగించడం మీద అనుమానాలు లేకపోలేదు. ఏపీలో పలు కేంద్రాల్లో పది రోజులకు తీసుకున్న యాభై రూపాయల టికెట్ రేట్ పెంపు కలెక్షన్ల మీద ప్రభావం చూపిస్తోందని ఎగ్జిబిటర్స్ టాక్. త్వరగా సాధారణ స్థితికి తేవాల్సిందని అభిప్రాయపడుతున్నారు.

ఇదిలా ఉండగా కన్నప్ప మళ్ళీ పికప్ కావాలంటే వీకెండ్ దాకా ఎదురు చూడాలి. అయితే ఇక్కడ కొన్ని చిక్కులున్నాయి. శుక్రవారం నితిన్ తమ్ముడు, సిద్దార్థ్ 3 బిహెచ్కె లు మంచి అంచనాలతో థియేటర్లలో అడుగు పెడుతున్నాయి. హాలీవుడ్ మూవీ జురాసిక్ వరల్డ్ రీ బర్త్ సైతం క్లాస్ ఆడియన్స్ ని లాగుతుంది. ఈ నేపథ్యంలో కన్నప్ప అనూహ్యంగా పుంజుకోవడం అనేది కొత్త రిలీజుల ఫలితాల మీద ఆధారపడి ఉంటుంది. ప్రభాస్ పాత్ర ఓపెనింగ్స్ తెచ్చినప్పటికీ లాంగ్ రన్ కు అవసరమైన యునానిమస్ టాక్ తెచ్చుకోవడంలో కన్నప్ప వర్కౌట్ చేయలేకపోయాడు. మిశ్రమ స్పందన వచ్చిన వైనం కళ్ళముందు కనిపిస్తోంది.

ఒకవేళ ప్రమోషన్లు ఏమైనా ఫ్రెష్ గా ప్లాన్ చేస్తారేమో చూడాలి. పైరసీ తెచ్చిన ముప్పుని కూడా కొట్టిపారేయలేం. విష్ణు అధికారికంగా 30 వేల లింకులు తీయించామని చెప్పాడు. ఇంకా దొరకనివి ఇంకెన్ని వేలు ఉంటాయో చెప్పలేం. ఈ నేపథ్యంలో కన్నప్ప బ్రేక్ ఈవెన్ అవుతుందా అనేది పెద్ద ప్రశ్న. మంచు ఫ్యామిలీ ఓన్ రిలీజ్ కాబట్టి థియేటర్ బిజినెస్ ఎంత టార్గెట్ చేశారనేది బయటికి చెప్పడం లేదు. మైత్రి తదితర సంస్థలు అండదండలు అందించినప్పటికీ జనాన్ని పుష్ చేయాల్సింది కంటెంటే. మొన్నామధ్య సక్సెస్ టూర్ ప్లాన్ చేస్తామని శివబాలాజీ అన్నాడు. అది జరిగితే పరిస్థితి కొంత మెరుగు పడొచ్చు.