యూత్ హీరోల చేతికి దీపావళి బాక్సాఫీస్

సంక్రాంతి, దసరాలాగే క్రమంగా దీపావళి కూడా టాలీవుడ్ కు కీలక సీజన్ గా మారుతోంది. గతంలో పటాసుల పండక్కు ఒక రోజు సెలవే వస్తుంది కాబట్టి పెద్ద నిర్మాతలు అంత సీరియస్ గా తీసుకునేవారు కాదు. కానీ క్రమంగా పెరుగుతున్న కాంపిటీషన్, ఇతర నెలల్లో సరైన డేట్లు దొరక్కపోవడం లాంటి కారణాల వల్ల ఇప్పుడు దివాలి మీద అందరి కన్ను పడుతోంది. 2025లో రాబోయే ఈ పండక్కు యూత్ హీరోలు నువ్వా నేనాని పోటీ పడేలా ఉన్నారు. సిద్ధూ జొన్నలగడ్డ తెలుగు కదా’ ఆల్రెడీ అక్టోబర్ 17 అఫీషియల్ గా లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే. నీరజ కోన దర్శకత్వంలో రూపొందుతున్న ఈ లవ్ ఎంటర్ టైనర్ కు తమన్ సంగీతం.

కిరణ్ అబ్బవరం ‘కె రాంప్’ ఫస్ట్ లుక్ పోస్టర్ లో దీపావళి రిలీజ్ అని చెప్పేశారు కాబట్టి ఇది కూడా రేసులోకి వచ్చేసింది. గత ఏడాది క ఇదే టైంలో వచ్చి బ్లాక్ బస్టర్ కొట్టడంతో ఆ సెంటిమెంట్ పెట్టుకున్నారు కాబోలు. లవ్ టుడే, డ్రాగన్ తో తెలుగులోనూ ఫాలోయింగ్ సంపాదించుకున్న ప్రదీప్ రంగనాధన్ ‘డ్యూడ్’కి దీపావళి టార్గెట్ గా పెట్టుకున్నారు. మమిత బైజు హీరోయిన్ కావడం ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. మైత్రి సంస్థ నిర్మాణం కనక రిలీజ్ పరంగా పెద్ద సపోర్ట్ ఉంటుంది. ఇవి కాకుండా కార్తీ ‘సర్దార్ 2’ ఇదే టైంకి రావాలని చూస్తోంది కానీ ఇంకా అఫీషియల్ గా నోట్ రాలేదు. సూర్య ‘కరుప్పన్’ సైతం ఈ ఆప్షన్ చూస్తోందట.

అన్నదమ్ములు ఇద్దరూ ఒకేసారి రారు కాబట్టి ఎవరు డ్రాప్ అవుతారనేది వేచి చూడాలి. సెప్టెంబర్ చివరి వారంలో ఓజి, అఖండ లాంటి క్రేజీ మూవీస్ ఉన్న నేపథ్యంలో మిడిల్ బడ్జెట్ సినిమాలకు అక్టోబర్ మంచి ఛాయస్ గా కనిపిస్తోంది. అందుకే వేరొకరు తొందరపడకుండా ముందుగానే కర్చీఫ్స్ వేసే పనిలో నిర్మాతలు బిజీగా ఉన్నారు. ఒకవేళ రామ్ ‘ఆంధ్రాకింగ్ తాలూకా’ కనక సెప్టెంబర్ లో రాకపోతే అది కూడా దీపావళి లిస్టులో తోడయ్యే ఛాన్స్ కొట్టిపారేయలేం. ప్రస్తుతానికి ఇవన్నీ ఫిక్స్ అయినట్టుగా కనిపిస్తున్నాయి కానీ ఏ నిమిషానికి ఏమి జరుగునో పాట తరహాలో ఎవరెవరు మాట మీద ఉంటారో వేచి చూడాలి.