‘కుబేర’ క్లైమాక్స్ విమర్శలపై కమ్ముల

ధనుష్, అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రల్లో విలక్షణ దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందించిన ‘కుబేర’ తెలుగులో మంచి ఫలితాన్నందుకుంది. రిలీజ్ ముంగిట పెద్దగా హైప్ లేకపోయినా.. తొలి రోజు చాలా మంచి టాక్ రావడంతో సినిమా పుంజుకుంది. తొలి వీకెండ్లో భారీ వసూళ్లు సాధించిన ఈ చిత్రం.. ఆ తర్వాత కూడా డీసెంట్ రన్‌తో కొనసాగుతోంది. రెండో వీకెండ్లో కూడా ఈ చిత్రానికి తెలుగులో మంచి వసూళ్లే వచ్చాయి.

ఐతే ఇటు విమర్శకులు, అటు ప్రేక్షకులు ఈ సినిమా గురించి చాలా వరకు పాజిటివ్‌గానే మాట్లాడారు కానీ.. సెకండాఫ్, క్లైమాక్స్ విషయంలో మాత్రం కొంతమేర విమర్శలు తప్పలేదు. సినిమా నిడివి ఎక్కువైందని.. ఒక డిఫరెంట్ క్లైమాక్స్ ఆశిస్తే, హీరో చేతిలో విలన్ చావడం అనే రొటీన్ క్లైమాక్స్‌తో కమ్ముల నిరాశపరిచాడనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ విమర్శలపై శేఖర్ కమ్ముల ఓ ఇంటర్వ్యూలో స్పందించాడు.
‘కుబేర’ క్లైమాక్స్ గురించి చాలా ఆలోచించాకే.. ఇప్పుడు సినిమాలో ఉన్నది ఖరారు చేశామని కమ్ముల తెలిపాడు.

విలన్ చాలా పవర్ ఫుల్ వ్యక్తి అని.. అతడికి వ్యతిరేకంగా సాక్ష్యాలు సేకరించి జైలుకు పంపించినా.. తనకున్న పవర్‌తో ఈ సిస్టంను మేనేజ్ చేసి అతను బయటికి వచ్చేస్తాడని.. ఆ స్థాయి వ్యక్తిని ఒక బిచ్చగాడు ఏమీ చేయలేడని కమ్ముల అభిప్రాయపడ్డాడు. అందుకే దేవా చేతిలో అతను చనిపోవడమే కరెక్ట్ అనిపించిందని చెప్పాడు.

మంచి జన్మ రావాలంటే కట్టలు వేసి కాల్చాలని దేవా ఎప్పుడు చెబుతూ ఉంటాడని.. అంత ధనవంతుడైన విలన్ చెత్త కుప్పలు కట్టెలు కూడా లేకుండా దిక్కులేని చావు చస్తాడని.. అది అతడికి సరైన శిక్ష అని.. ఇలా పొయెటిక్ స్టయిల్లో క్లైమాక్స్ డిజైన్ చేశామని కమ్ముల తెలిపాడు. ఇక సినిమా నిడివి ఎక్కువ ఉండడం గురించి శేఖర్ మాట్లాడుతూ.. రన్ టైం తగ్గించడానిక వీలైనంత ప్రయత్నించామని.. కానీ ఈ కథను ఇలా చెబితేనే కరెక్ట్ అని మూడు గంటల నిడివితో రిలీజ్ చేశామని.. అలా అని అంత నిడివి ఉంటే గొప్ప అనేమీ కాదని కమ్ముల చెప్పాడు.