సినీ పరిశ్రమలో బిగ్గెస్ట్ క్లాష్ గా చెప్పబడుతున్న ఆగస్ట్ 14 కోసం కోట్లాది మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. హైప్ పరంగా చూసుకుంటే కూలి చాలా ముందంజలో ఉందనేది ఒప్పుకోవాల్సిన వాస్తవం. టీజర్ తప్ప వార్ 2కి సంబంధించిన ఎలాంటి ప్రమోషనల్ కంటెంట్ ఇంకా బయటికి రాలేదు. ఆ వీడియో ఎక్కువ శాతం విమర్శలకే గురయ్యింది. ఇంకోవైపు రజని ఇమేజ్ తో పాటు నాగార్జున ఫోటోని వాడుకుని దర్శకుడు లోకేష్ కనగరాజ్ తన బ్రాండింగ్ తో చేస్తున్న మార్కెటింగ్ నెక్స్ట్ లెవెల్ హైప్ తీసుకొస్తోంది. ఇక్కడిదాకా బాగానే ఉంది కానీ డిస్ట్రిబ్యూషన్ పరంగా వార్ 2 చాప కింద నీరులా మారుతోందని ట్రేడ్ టాక్.
బాలీవుడ్ రిపోర్ట్స్ ప్రకారం ఇండియాలో ఉన్న ముప్పైకి పైగా ఒరిజినల్ ఐమాక్స్ స్క్రీన్లలో అత్యధిక శాతం వార్ 2కి వచ్చేలా చేసుకునే పనిలో నిర్మాత ఆదిత్య చోప్రా బిజీగా ఉన్నారట. ఇప్పటికే అగ్రిమెంట్లు అయిపోయాయని, అధిక శాతం ఐమాక్స్ లు పివిఆర్ ఐనాక్స్ చేతుల్లో ఉండటంతో ఈ పని మరింత సులువయ్యిందని అంటున్నారు. అంటే కూలీకి చాలా తక్కువగా సింగల్ డిజిట్ లోనే ఈ స్పెషల్ స్క్రీన్లు దొరుకుతాయన్న మాట. ఇది బిజినెస్ పరంగా తెలివైన ఎత్తుగడ. ఎందుకంటే ఐమాక్స్ ఎక్స్ పీరియన్స్ కోసం సినిమాలు చూసే ఆడియన్స్ సంఖ్య భారీగా ఉంటుంది. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో ఇది మరీ ఎక్కువ.
అలాంటప్పుడు కూలి సింగల్ స్క్రీన్లు, రెగ్యులర్ మల్టీప్లెక్సులతో సర్దుకోవాల్సి ఉంటుంది. వీటిలోనూ వార్ 2 చాలా బలమైన కాంపిటీషన్ ఇవ్వనుంది. ముంబై, ఢిల్లీ, కోల్కతా, అహ్మదాబాద్ లాంటి కీలక సెంటర్లలో జూనియర్ ఎన్టీఆర్ – హృతిక్ రోషన్ మాస్ మీదే జనాల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు కూలికి ఇబ్బందులు తప్పవు . అయినా ఐమాక్స్ టెక్నాలజీ గురించి తెలుగు ఫ్యాన్స్ టెన్షన్ పడనక్కర్లేదు. ఎందుకంటే ఏపీ తెలంగాణలో ఇప్పటిదాకా ఈ సౌకర్యం లేదు. భవిష్యత్తులో తీరే అవకాశాలున్నాయి కానీ చాలా టైం పట్టేలా ఉంది. పివిఆర్ లేదా ఏషియన్ ఏదో ఒక సంస్థ లేట్ అయినా ఈ సాంకేతికను తీసుకొస్తుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates