తమిళ ‘కుబేర’ పెర్ఫామెన్స్‌పై స్పందించిన కమ్ముల

తమిళంలో మాంచి ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ ఉన్న స్టార్ హీరోల్లో ఒకడు ధనుష్. తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చివరి చిత్రం ‘రాయన్’ ఏకంగా రూ.150 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. సార్, తిరుచిత్రాంబళం సినిమాలు కూడా వంద కోట్ల క్లబ్బులో చేరాయి. తన సినిమాలకు పాజిటివ్ టాక్ వస్తే తమిళనాట భారీ వసూళ్లు సాధిస్తుంటాయి. కానీ టాలీవుడ్‌కు చెందిన శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ లీడ్ రోల్‌లో నటిస్తూ, అక్కినేని నాగార్జున ప్రత్యేక పాత్ర పోషించిన ‘కుబేర’ మాత్రం తమిళనాట ఆశించిన వసూళ్లు సాధించలేకపోయింది. ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్సే డల్లుగా జరిగాయి.

ఐతే రిలీజ్ తర్వాత మంచి టాక్ వస్తే సినిమా పుంజుకుంటుందని అనుకున్నారు. కోరుకున్నట్లే పాజిటివ్ టాక్ వచ్చింది. తమిళ రివ్యూయర్లందరూ సినిమాను కొనియాడారు. ధనుష్ కెరీర్లో బెస్ట్ మూవీస్‌లో ఒకటని ‘కుబేర’ను అభివర్ణించారు. తొలి రోజు వసూళ్లు ఆశాజనకంగానే కనిపించాయి. కానీ ఓవరాల్‌గా వీకెండ్లో ఓ మోస్తరు వసూళ్లతో సరిపెట్టుకుందా చిత్రం. వీకెండ్ తర్వాత వసూళ్లు బాగా పడిపోయాయి. ప్రస్తుతానికి వసూళ్లు రూ.20 కోట్లకు అటు ఇటుగా ఉన్నాయి. ఫుల్ రన్లోనూ రూ.25 కోట్లకు మించి రాబట్టే అవకాశం కనిపించడంలేదు. ఈ సినిమాకు తమిళంలో జరిగిన బిజినెస్సే తక్కువ. రూ.18 కోట్ల తక్కువ మొత్తానికి హక్కులు అమ్మారు. వసూళ్లు చూస్తుంటే 40-50 శాతం మధ్య నష్టాలు తప్పేట్లు లేవు.

‘కుబేర’కు తమిళంలో ఆశించిన వసూళ్లు రాకపోవడం పట్ల దర్శకుడు శేఖర్ కమ్ముల సైతం షాకయ్యాడు. ఓ ఇంటర్వ్యూలో దీని గురించి అతను మాట్లాడాడు. తెలుగులో భారీ వసూళ్లు సాధించిన ఈ చిత్రం.. తమిళంలో మాత్రం సరిగా పెర్ఫామ్ చేయకపోవడం గురించి కమ్ముల ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. నిజానికి ‘కుబేర’ కథ, ధనుష్ పాత్ర తమిళ సెన్సిబిలిటీస్‌కు తగ్గట్లుగా ఉంటాయని కమ్ముల అన్నాడు. ఇలాంటి వైవిధ్యమైన కథలు, పాత్రలను అక్కడి వాళ్లు బాగా ఆదరిస్తారని.. వాళ్ల అభిరుచికి తగ్గ సినిమా ఇదని.. అయినా ఈ సినిమాకు వసూళ్లు తక్కువ రావడం ఏంటో అర్థం కావడం లేదని కమ్ముల వ్యాఖ్యానించాడు. అసలిలా ఎందుకు అయిందో, ఎక్కడ తప్పు జరిగిందో కనుక్కునే ప్రయత్నం చేస్తున్నామని ఆయన పేర్కొన్నాడు.