ఈ రోజు విడుదలైన కన్నప్ప థియేటర్లు జనంతో కళకళలాడుతూ కనిపించాయి. కుబేర తర్వాత తక్కువ గ్యాప్ లో హౌస్ ఫుల్స్ చేసే సినిమా రావడంతో ఎగ్జిబిటర్ల ఆనందం మాములుగా లేదు. ఇంత గ్రాండ్ ఓపెనింగ్ రావడానికి ఒకే ఒక్క కారణం ప్రభాస్ అని వేరే చెప్పనక్కర్లేదు. చాలా చోట్ల ఉదయం 7 గంటల షోకే వాళ్ళ సెలబ్రేషన్స్ కనిపించాయి. మంచు విష్ణు మెయిన్ హీరో అయినప్పటికీ అరగంటకు పైగా డార్లింగ్ క్యామియో ఉంటుందని చెప్పడంతో పెద్ద ఎత్తున అంచనాలు పెట్టుకుని వచ్చారు. దానికి తగ్గట్టే మెయిన్ హైలైట్స్ లో ప్రభాస్ పాత్రే మొదటిది కావడం గమనించాల్సిన విషయం. ఇక ఫ్యాన్స్ విషయానికి వద్దాం.
సినిమా చూసి బయటికి వచ్చిన అభిమానుల రియాక్షన్లు సంతృప్తికరంగా ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే కన్నప్పలోని లోపాలు రుద్రా క్యారెక్టర్, క్లైమాక్స్ ద్వారా కవరైపోయాయని, మంచి ఎక్స్ పీరియన్స్ అని అనిపించిందంటే దానికి కారణం ఈ రెండు అంశాలేనని బల్లగుద్ది చెబుతున్నారు. అయితే మంచు విష్ణు ప్రీ రిలీజ్ లో చెప్పినట్టు ప్రభాస్ పూర్తి నలభై నిముషాలు లేకపోవడం కొంత లోటే ఉన్నంతలో డైలాగులతో ఆకట్టుకున్న వైనం శాటిస్ ఫై చేసింది. మంచు విష్ణు పెర్ఫార్మన్స్, దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ పనితనం గురించి తర్వాత మాట్లాడుకుంటున్నారు. అయితే ఇక్కడింకో పాయింట్ ఉంది.
లాంగ్ రన్ కు, ఫ్యామిలీ ఆడియన్స్ ని థియేటర్లకు రప్పించేందుకు ప్రభాస్ ఎంత పెద్ద ఎత్తున ఉపయోగపడతాడనేది వేచి చూడాలి. ఎందుకంటే కన్నప్పకు యునానిమస్ టాక్ పూర్తిగా రాలేదు. అందరూ సెకండాఫ్ గురించే ఎక్కువ పాజిటివ్ గా చెబుతున్న తరుణంలో దీని ప్రభావం ఏ మేరకు కలెక్షన్ల మీద ఉంటుందని అప్పుడే చెప్పలేం. కాకపోతే ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు వాళ్ళు సినిమాని సోషల్ మీడియాలో ఎంతమేరకు ఫుల్ చేస్తారనేది చూడాలి. ప్రమోషన్లకు దూరంగా ఉండిపోయిన ప్రభాస్ ఇవాళ ఇన్స్ టా స్టేటస్ ద్వారా మంచు విష్ణు బృందానికి శుభాకాంక్షలు చెప్పాడు. కన్నప్పతో పాటు రాజా సాబ్ టీజర్ కూడా స్క్రీన్ చేస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates