ప్రభాస్ మౌనానికి కారణం అదేనా

ఇంకో రెండు రోజుల్లో కన్నప్ప భారీ ఎత్తున విడుదల కానుంది. ఇవాళ్టి నుంచి తెలుగు రాష్ట్రాల అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు పెట్టబోతున్నారు. మంచు విష్ణు తన వంతుగా ప్రమోషన్లకు ఎంత చేయాలో అంతకన్నా ఎక్కువే కష్టపడ్డాడు. రెండు పెద్ద ప్రీ రిలీజ్ ఈవెంట్లతో పాటు లెక్కలేనన్ని ఇంటర్వ్యూలు ఇచ్చి బోలెడు విశేషాలు పంచుకున్నాడు. పుణ్యక్షేత్రాలు తిరిగాడు. పలువురు ఆలయ ప్రముఖులు, పూజారులకు సినిమా చూపించి సందేహాలు నివృత్తి చేసుకున్నాడు. సెన్సార్ చెప్పిన అభ్యంతరాలు తొలగించి ఫైనల్ కట్ 3 గంటల 2 నిమిషాలకు లాక్ చేశాడు. ఇక్కడిదాకా అంతా సవ్యంగానే జరిగింది.

సెకండాఫ్ లో ఒక కీలకమైన క్యామియో పోషించిన ప్రభాస్ ఈ పబ్లిసిటీలో ఎక్కడా నేరుగా కనిపించకపోవడం పట్ల ఫ్యాన్స్ కొంత అసంతృప్తికి గురవుతున్నారు. ఎందుకయ్యా అంటే అది ముందుగానే జరిగిన ఒప్పందమని ఇన్ సైడ్ టాక్. ప్రభాస్ ఈ క్యారెక్టర్ చేయడానికి ఒప్పుకున్న టైంలోనే ప్రమోషన్లకు తాను రాలేనని, తర్వాత మొహమాట పెట్టి ఇబ్బంది పడొద్దని చాలా చనువుగా విష్ణు, మోహన్ బాబుకు చెప్పినట్టు సన్నిహితుల సమాచారం. దాంట్లో ఏముంది లెమ్మని, పాత్ర చేయడమే గొప్ప విషయమంటూ ఆ ఇద్దరూ ఒప్పేసుకున్నారట. అందులోనూ ప్రభాస్ విదేశాల నుంచి తిరిగి రాగానే ఫౌజీలో బిజీ అయ్యాడు.

ఇదంతా ఓకే కానీ నిజంగా ప్రభాస్ కనక కెమెరా ముందుకొచ్చి కన్నప్పని ప్రమోట్ చేసి ఉంటే హైప్ నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళేదన్న మాట వాస్తవం. ఎల్లుండి వచ్చే ఓపెనింగ్స్ లో సింహ భాగం తనదే అవుతుంది. టాక్ బాగా వస్తే అప్పుడు మంచు విష్ణు పేరు ముందుకొస్తుంది. టీమ్ ఎంత నమ్మకంగా ఉన్నా పాజిటివ్ టాక్ రావడం చాలా కీలకం. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ డివోషనల్ డ్రామాలో మోహన్ లాల్, అక్షయ్ కుమార్ కాజల్ అగర్వాల్, శరత్ కుమార్ లాంటి పెద్ద క్యాస్టింగ్ అంచనాలు పెంచుతోంది. అన్నింటికన్నా ఎక్కువ డార్లింగ్ కటవుట్ చేస్తున్న మార్కెటింగే చాలా స్పెషల్.