సూర్య అదృష్టమా.. దురదృష్టమా?

గత కొన్నేళ్లుగా వరుస పరాజయాలు చవిచూస్తోన్న తమిళ స్టార్‍ హీరో సూర్య ‘ఆకాశం నీ హద్దురా’ చిత్రానికి వస్తోన్న స్పందనతో సంతోషంగా వున్నాడు. ఈ చిత్రానికి యునానిమస్‍ పాజిటివ్‍ రెస్పాన్స్ అన్ని వర్గాల నుంచీ వస్తోంది. అయితే ఓటిటి ద్వారా విడుదలవడం వల్ల సూర్య తన పరాజయాల పరంపరకు బ్రేక్‍ వేసే అవకాశాన్ని కోల్పోయాడని, ఈ చిత్రం థియేటర్లలో విడుదలై వుంటే మాస్‍కి బాగా చేరువయి వుండేదని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

ఇంత పెద్ద చిత్రాన్ని ఓటిటిలో విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నప్పుడే చాలా మంది షాకయ్యారు. అయితే ఇంత ఎమోషనల్‍ సినిమా థియేటర్లనుంచి కూడా ఇదే విధమైన స్పందన రాబట్టి వుండేదా అనేది అనుమానమేనని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. అదీ కాకుండా ఒకవేళ థియేటర్లలో విడుదల కోసం వేచి చూసినట్టయితే విజయ్‍ ‘మాస్టర్‍’తో పాటు క్లాష్‍ అవ్వాల్సి వచ్చేది. విజయ్‍ సినిమాతో పోటీకి దిగితే ఖచ్చితంగా ‘ఆకాశం నీ హద్దురా’ వసూళ్లకి డెంట్‍ పడుతుంది.

ఇదంతా ఆలోచించడం వలనే మంచి డీల్‍ రావడంతో సూర్య ఈ చిత్రాన్ని అమ్మేసాడు. వరుసగా ఫెయిల్యూర్స్ చూస్తోన్న టైమ్‍లో చెల్లాచెదురైపోయిన సూర్య అభిమానులు మళ్లీ హల్‍చల్‍ చేస్తున్నారు. దీని తర్వాత విడుదలయ్యే చిత్రం బాగున్నట్టయితే సూర్య మళ్లీ పూర్వ వైభవం తెచ్చేసుకోవచ్చు.