దిల్ రాజు చెప్పిన ప్యాన్ ఇండియా పాఠం

పాతిక సంవత్సరాలకు పైగా సుదీర్ఘ అనుభవమున్న డిస్ట్రిబ్యూటర్, నిర్మాత దిల్ రాజు చెప్పే కొన్ని అనుభవాలు, పాఠాలు నిజంగా పాటించేలానే ఉంటాయి. జూలై 4 విడుదల కాబోతున్న నితిన్ తమ్ముడు ప్రమోషన్లలో భాగంగా ఆయన పంచుకుంటున్న కబుర్లు ఆలోచింపజేసేలా ఉన్నాయి. గేమ్ ఛేంజర్ ఒప్పుకున్న టైంలో శంకర్ లాంటి పెద్ద డైరెక్టర్ తో ఎలాంటి కండీషన్లు కాంట్రాక్టులో రాసుకోకపోవడం వల్ల ప్రొడ్యూసర్ తనే అయినప్పటికీ దిల్ రాజు ఎలాంటి నియంత్రణ చేయలేకపోయారు. ఫలితంగా బడ్జెట్ చేయి దాటి పోతున్నా ఏం చేయలేని నిస్సహాయతలో అలా చూస్తూ ఉండిపోయారు.

దీని వల్ల గేమ్ ఛేంజర్ నిడివి ఏకంగా నాలుగు గంటలు దాటేయడంతో పాటు ఫలితం డిజాస్టర్ కావడం తీవ్ర నష్టాలు తీసుకొచ్చింది. అంతే కాదు ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ సినిమాగా వచ్చిన ఈ మూవీ ద్వారా మెగా పవర్ స్టార్ కు ఒక హిట్టు ఇవ్వలేదనే లోటు ఆయన్ని ఎమోషనల్ గా కూడా వెంటాడింది. ఇదంతా ఆయనే చెప్పుకొచ్చారు. ఇక్కడ నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే ఎంత పెద్ద స్టార్ డైరెక్టర్ తో పని చేస్తున్నా సరే కొన్ని నిబంధనలు పెట్టుకోవడం చాలా అవసరం. పెట్టుబడి పెట్టే వాడిగా నిర్మాతకు ఆ హక్కు ఉంటుంది. కేవలం క్రేజ్ ఉచ్చులో పడి మౌనంగా ఉంటే చేతులు కాలడం తప్ప ఏం ఉండదు.

నిజానికి ఇండియన్ 2నే దిల్ రాజు చేయాల్సింది. ఆ మేరకు ప్రాథమికంగా అంగీకారం కూడా చేసుకున్నారు. కానీ బడ్జెట్ ఇష్యూస్ వల్ల ఆయన తప్పుకోవడం, లైకా వాళ్ళు ఎంట్రీ ఇవ్వడం జరిగిపోయాయి. శంకర్ కు ఇచ్చిన అడ్వాన్స్ ని గేమ్ ఛేంజర్ కోసం వాడుకున్న దిల్ రాజు చరణ్ కు హిట్టవ్వడం ద్వారా రెండు లక్ష్యాలు నెరవేరుతాయనుకున్నారు. కానీ రివర్స్ అయ్యింది. యాభై సినిమాల సుదీర్ఘ ప్రయాణంలో దిల్ రాజు ఇంత పెద్ద స్కేల్ లో ఎప్పుడూ సినిమా తీయలేదు. కానీ తీసింది గొప్ప లెసెన్ అయ్యింది. తమ్ముడు మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్న రాజు గారు నితిన్ కి బ్లాక్ బస్టర్ ఖాయమనే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.