సోనూ సూద్ చేసినవన్నీ రాసేయబోతున్నాడు

లాక్ డౌన్ హీరో సోనూ సూద్ ఒక బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నాడు. ఒక పెద్ద న్యూస్ రేపు చెప్పబోతున్నా అంటూ బుధవారం ఒక పుస్తకం మీద ఆనుకుని ఉన్న ఫొటోతో ట్విట్టర్లో ఒక పోస్టు పెట్టిన సోనూ.. ఆ న్యూస్ ఏంటో ఈ రోజు వెల్లడించాడు. తాను ఆత్మకథ రాయబోతున్నట్లు ప్రకటించాడు. ఫొటోలో పుస్తకం కనిపించడంతో తాను చేపట్టి ఎడ్యుకేషనల్ ప్రాజెక్టుకు సంబంధించి ఏదైనా ప్రకటన చేస్తాడేమో అని అంతా అనుకున్నారు కానీ.. ఇలా ఆత్మకథ అంటాడని ఎవరూ అనుకోలేదు. ఈ ప్రకటన సోనూ అభిమానుల్లో అమితాసక్తిని రేకెత్తిస్తోంది.

దాదాపు రెండు దశాబ్దాలుగా సినీ రంగంలో ఉంటూ వివిధ భాషల్లో విలన్, క్యారెక్టర్ రోల్స్ చేసిన సోనూ, ఆ పాత్రలతో వచ్చిన పేరు కంటే.. కరోనా టైంలో అనితర సాధ్యమైన రీతిలో సేవా కార్యక్రమాలు చేపట్టి ఎక్కువ పేరు సంపాదించాడు. అతణ్ని జనాలు రియల్ హీరో అంటున్నారు.

ఆత్మకథలో కూడా ఒక భాగం సినీ రంగ ప్రయాణం నేపథ్యంలో ఉంటే.. ఇంకో భాగం కరోనా-లాక్ డౌన్ టైంలో తాను చేపట్టిన సేవా కార్యక్రమాలు, అవి ఇచ్చిన సంతృప్తి, తన వర్తమాన-భవిష్యత్ ప్రణాళికల గురించే సోనూ వివరించే అవకాశముంది. వేల కోట్ల సంపద ఉన్న వాళ్లే కరోనా టైంలో నామమాత్రంగా విరాళాలు ప్రకటించి ఊరుకుంటే.. ప్రభుత్వాలు కూడా చేతులెత్తేస్తే.. సోనూ మాత్రం గొప్ప మనసుతో వలస కార్మికులను స్వస్థలాలకు చేర్చడంతో మొదలుపెట్టి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. ఇప్పటికీ వందల మందిని ఆదుకుంటున్నాడు.

భవిష్యత్తులో లక్షల మందికి ఉపయోగపడేలా ఉపకార వేతనాలు, ఉద్యోగ అవకాశాలు అందింేచ ప్రణాళికలతో ముందుకెళ్తున్నాడు. వీటన్నింటి గురించి సోనూ తన ఆత్మకథలో ప్రస్తావించబోతున్నట్లే. ఆ పుస్తకం హాట్ కేకుల్లా అమ్ముడవుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదేమో.