డ్రగ్స్ కేసులో హీరో అరెస్ట్

కొన్నేళ్ల ముందు తమిళ సినీ పరిశ్రమలో డ్రగ్స్ కేసు ఎంతటి సంచలనం రేపిందో తెలిసిందే. తర్వాత బెంగళూరులోనూ రేవ్ పార్టీతో టాలీవుడ్ సెలబ్రెటీలకు కనెక్షన్ ఉందని తేలడం కలకలం రేపింది. ఇప్పుడు ఇలాంటి వ్యవహారమే కోలీవుడ్‌‌ను షేక్ చేస్తోంది. తెలుగువాడే అయినప్పటికీ.. తమిళంలో హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్న శ్రీకాంత్ (తెలుగులో శ్రీరామ్ అంటారు) డ్రగ్స్ కేసులో అరెస్ట్ కావడం చర్చనీయాంశంగా మారింది. నార్కోటిక్ పరీక్షల్లో పాజిటివ్‌గా తేలడంతో శ్రీకాంత్‌ను చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీకాంత్ లావాదేవీలను పరిశీలించగా.. డ్రగ్స్ కొనుగోళ్ల కోసం నాలుగున్నర లక్షల రూపాయలను వినియోగించినట్లు పోలీసులకు అర్థమైంది. శ్రీకాంత్ 40 సార్లు కొకైన్ కొన్నట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు. 

శ్రీకాంత్ అరెస్ట్ వ్యవహారం అనూహ్యంగానే జరిగింది. ఇటీవల డ్రగ్స్ వినియోగ ఆరోపణలతో అన్నాడీఎంకే పార్టీ ఐటీ వింగ్ మాజీ నేత ప్రసాద్ ఇటీవల అరెస్ట్ కాగా.. అతడి నుంచి సేకరించిన సమాచారంతో పోలీసుల దృష్టి శ్రీకాంత్ మీదికి మళ్లింది. ఓ పబ్బులో ప్రసాద్ ఘర్షణకు దిగగా.. అతను డ్రగ్స్ తీసుకున్నాడన్న ఆరోపణలతో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ క్రమంలోనే డ్రగ్ రాకెట్ గురించి చాలా విషయాలు తెలిశాయి. ప్రసాద్ ఇచ్చిన సమచారం మేరకే శ్రీకాంత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వెంటనే వైద్య పరీక్షలు నిర్వహించగా.. అతను డ్రగ్స్ తీసుకున్నట్లు వెల్లడైందట. చిత్తూరు జిల్లాకు చెందిన శ్రీకాంత్.. ‘రోజా కూట్టం’ చిత్రంతో తమిళ తెరకు పరిచయం అయ్యాడు. అది ‘బిచ్చగాడు’ దర్శకుడు శశి డైరెక్ట్ చేసిన చిత్రం. భూమిక హీరోయిన్‌గా నటించింది. ఆ సినిమా పెద్ద హిట్టయి శ్రీకాంత్‌కు బ్రేక్ ఇచ్చింది. తర్వాత అతను తెలుగులో ‘ఒకరికి ఒకరు’ సహా పలు చిత్రాల్లో నటించాడు. కానీ మధ్యలో తన కెరీర్ బాగా డౌన్ అయింది. ఈ మధ్యే శ్రీకాంత్ డిజిటల్ ఎంట్రీ ఇచ్చి వరుసగా వెబ్ సిరీస్‌లు చేస్తున్నాడు. కెరీర్ మళ్లీ ఊపందుకుంటున్న సమయంలో ఇప్పుడిలా అరెస్ట్ అయ్యాడు.