అనిరుధ్ మీద నెగిటివ్ కామెంట్సా

సౌత్ ఇండియాలో అత్యధిక డిమాండ్ ఉన్న సంగీత దర్శకుడిగా అనిరుద్ రవిచందర్ మేనియా గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. కొన్ని మాములు సన్నివేశాలను సైతం తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో నిలబెట్టే సత్తా ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ గా తనకున్న ఫాలోయింగ్ మామూలుది కాదు. జైలర్, విక్రమ్, దేవరలు కొన్ని ఉదాహరణలు మాత్రమే. అందుకే పది కోట్లు డిమాండ్ చేస్తున్నా సరే ఎస్ అంటున్న నిర్మాతలు బోలెడు. సమయం లేదన్నా సరే వెయిట్ చేస్తున్న దర్శకుల లిస్టు పెద్దదే. అలాంటిది అనిరుధ్ మీద నెగటివ్ కామెంట్స్ రావడం సాధారణంగా ఊహించం. కానీ అది నిన్న జరిగిపోయింది.

పొలిటికల్ ఎంట్రీ ముందు విజయ్ చేస్తున్న చివరి సినిమాగా జన నాయకుడు మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. నిన్న విజయ్ పుట్టినరోజు సందర్భంగా చిన్న టీజర్ వదిలారు. పోలీస్ ఆఫీసర్ గెటప్ లో స్టయిలిష్ గా నడుచుకుంటూ కత్తితో మీసాలు తిప్పే షాట్ ఫాన్స్ కి ఓ రేంజ్ కిక్ ఇచ్చింది. అయితే బిజిఎం ఆశించిన స్థాయిలో లేదనే కామెంట్స్ సోషల్ మీడియాలో గట్టిగానే వినిపించాయి. అసలే ఇది భగవంత్ కేసరి రీమేకనే ప్రచారం జోరుగా తిరుగుతోంది. దీంతో కొందరు ఆ సినిమాకు తమన్ కంపోజ్ చేసిన బిజిఎం తీసుకొచ్చి జన నాయకుడుకి సింక్ చేసి వదిలాక పాజిటివ్ రెస్పాన్స్ రావడం అసలు ట్విస్టు.

కేవలం నిమిషం వీడియోని పట్టుకుని అనిరుధ్ ని జడ్జ్ చేయడం గురించి అభిమానులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు కానీ నిజానికి ఇంకా ఎక్కువ ఎక్స్ పెక్ట్ చేసిన ఫ్యాన్స్ కొంత నిరాశకు గురైన మాట వాస్తవం. అనిరుద్ ప్రస్తుతం తీవ్ర పని ఒత్తిడిలో ఉన్నాడు. రజనీకాంత్ కూలి రీ రికార్డింగ్ ప్లాన్ చేసుకోవాలి. దానికన్నా ముందు విజయ్ దేవరకొండ కింగ్ డమ్ బాధ్యత ఉంది. ఇంకోవైపు శివ కార్తికేయన్ మదరాసి, ప్రదీప్ రంగనాథన్ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీలు చివరి దశలో ఉన్నాయి. ఏది ఏమైనా అనిరుద్ ఇప్పుడొచ్చిన ఫీడ్ బ్యాక్ ని సీరియస్ గా తీసుకుని మళ్ళీ రిపీట్ కాకుండా చూడాలనేది మ్యూజిక్ లవర్స్ కోరిక.