హమ్మయ్యా అనుకుంటున్న అమీర్ ఖాన్

తాజాగా విడుదలైన సితారే జమీన్ పర్ కలెక్షన్లు భీభత్సంగా లేకపోయినా క్రమంగా ఊపందుకుంటున్న వైనం చూసి అమీర్ ఖాన్ హమ్మయ్య అనుకుంటున్నాడు. బాలీవుడ్ వర్గాల ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం మొదటి మూడు రోజులకు గాను ఈ సినిమా 60 కోట్ల దాకా వసూలు చేసింది. ముఖ్యంగా నిన్న ఆదివారం పెద్ద నెంబర్లు నమోదయ్యాయి. ఎక్స్ ట్రాడినరి టాక్ రాకపోయినా డీసెంట్ గా ఉంది, ఒకసారి చూడొచ్చనే అభిప్రాయాలు క్రమంగా పెరగడం అమీర్ కు కలిసి వస్తోంది. అందులోనూ మహేష్ బాబు లాంటి సెలబ్రిటీలు కంటెంట్ బాగుందని మద్దతు తెలుపుతూ సోషల్ మీడియాలో షేర్ చేయడం పాజిటివిటీని పెంచింది.

ట్రెండ్ చూస్తుంటే రికార్డులు బద్దలు కొట్టకపోయినా అమీర్ ఖాన్ కు సితారే జమీన్ పర్ సేఫ్ వెంచర్ అయ్యేలా ఉంది. హిందీలో చెప్పుకోదగ్గ రిలీజులు లేవు. కుబేర ఇక్కడ బ్లాక్ బస్టర్ అయినా ఉత్తరాదిలో పెద్దగా స్పందన లేదు. దీంతో అక్కడ అమీర్ మూవీనే ఫస్ట్ ఛాయస్ అవుతోంది. తారే జమీన్ పర్, చక్ దే ఇండియా లాంటి వాటిని మిక్స్ చేసి దర్శకుడు ఆర్ఎస్ ప్రసన్న చేసిన ప్రయోగం ఫ్యామిలీస్ ని ఆకట్టుకుంటోంది. హాలీవుడ్ మూవీ ఛాంపియన్స్ రీమేక్ అయినప్పటికీ నేటివిటీ జోడించి మార్పులు చేసిన విధానం వర్కౌట్ అయ్యేలా వచ్చింది. దాంతో కలెక్షన్లు పెరుగుతున్నాయి.

లాల్ సింగ్ చద్దా దారుణంగా డిజాస్టర్ అయినప్పుడు అమీర్ ఖాన్ ట్రోలింగ్ చవి చూశాడు. ఫారెస్ట్ గంప్ ని చెడగొట్టారనే కామెంట్స్ ఎక్కువగా వినిపించాయి. అయినా సరే మరో రీమేక్ తో రెడీ అయ్యాడు. సితారే జమీన్ పర్ ఎనిమిది వారాల తర్వాత యూట్యూబ్ పే పర్ వ్యూ మోడల్ లో రావొచ్చని రిలీజ్ కు ముందే ప్రచారం జరిగింది. ఓటిటి సంస్థలు వంద కోట్లకు పైగా ఆఫర్ ఇచ్చినా అమీర్ నో చెప్పాడు. మరి ఇప్పుడు హిట్ దిశగా వెళ్తోంది కాబట్టి నిర్ణయం మార్చుకుంటాడా లేక దానికే కట్టుబడతారా అనేది వేచి చూడాలి. త్వరలో దేశవ్యాప్తంగా పలు స్కూల్ పిల్లలకు ప్రత్యేక షోలు వేసే ఆలోచనలో అమీర్ ఉన్నట్టు తెలిసింది.