సోమవారం పరీక్ష మొదలెట్టిన కుబేర

ఈ మధ్య బ్లాక్ బస్టర్ టాక్ వచ్చిన సినిమాలు సైతం వీక్ డేస్ మొదలుకాగానే స్ట్రగుల్ కావడం చూస్తున్నాం. హిట్ 3 ది థర్డ్ కేస్ దీనికి మంచి ఉదాహరణ. నాలుగు రోజులు భీకరంగా వసూళ్లు రాబట్టాక ఉన్నట్టుండి స్లో అయిపోవడం ట్రేడ్ ని ఆశ్చర్యపరిచింది. తర్వాత బ్రేక్ ఈవెన్, లాభాలు వచ్చిన మాట వాస్తవమే కానీ కొన్ని ఏరియాల్లో నష్టం తప్పలేదనే టాక్ కూడా ఉంది. ఇదిలా ఉండగా కుబేరకు సైతం అలాంటి పరిస్థితి ఎదురవ్వచ్చనే అనుమానం ఇండస్ట్రీ వర్గాల్లో లేకపోలేదు. ఎందుకంటే ఇది పండగ సీజన్ కాదు. వేసవి సెలవులు అయిపోయాయి. స్కూళ్ళు, కాలేజీలు అన్నీ తెరుచుకున్నాయి. కాబట్టి డౌట్ రావడం సహజం.

రిలీఫ్ ఏంటంటే కుబేరకు ఆ టెన్షన్ అక్కర్లేదు. ఎందుకంటే బుక్ మై షోలో గంటకు సగటున 4 వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోతున్నాయి. మాములుగా మండే రోజు ఇంత నెంబర్ కనిపించడం అరుదు. అందులోనూ కుబేర కమర్షియల్ మూవీ కాదు. మాస్ ని టార్గెట్ చేసుకున్నది అసలే కాదు. మసాలా పాటలున్న రెగ్యులర్ చిత్రం కాదు. పైగా ఫ్యామిలీ ఆడియన్స్ కోరుకునే ఎంటర్ టైన్మెంట్ కూడా లేదు. అలాంటప్పుడు కుబేర నెమ్మదిస్తుందనే భావన కలగడం మాములే. కానీ ట్రెండ్ చూస్తుంటే బయ్యర్లు నిశ్చింతగా ఉండొచ్చు అనిపిస్తుంది. ముఖ్యంగా ఏ సెంటర్స్ స్పందన భారీ ఎత్తున కనిపిస్తోంది.

రెండు రోజులకు యాభై కోట్లకు పైగా గ్రాస్ దాటేసిన కుబేర ఆదివారం సైతం పెద్ద సంఖ్యలే రాబట్టింది. ఇంకా అఫీషియల్ గా ప్రకటించాల్సి ఉంది. నిన్న చిరంజీవి అతిథిగా జరిగిన సక్సెస్ మీట్ కు మంచి స్పందన కనిపిస్తోంది. ఎటొచ్చి తమిళంలో స్టడీగా ఉండలేకపోవడం నిర్మాతల కోణంలో కీలకం కానుంది,. తెలుగు ఆడియన్స్ రిసీవ్ చేసుకున్నంతగా తమిళ ప్రేక్షకులు కుబేరని ఓన్ చేసుకోలేదని వసూళ్ల మధ్య వ్యత్యాసం స్పష్టం చేస్తోంది. జూన్ 27 కన్నప్ప వస్తున్నాడు. దీని ప్రభావం ఉంటుంది కాబట్టి ఆలోగా కుబేర వీలైనంత ఎక్కువ రాబట్టుకోవాలి. తర్వాత కన్నప్ప టాక్ ని బట్టి హెచ్చుతగ్గులు ఉంటాయి.