కన్నప్ప సినిమాలో హీరో మంచు విష్ణునే అయినా… ఈ చిత్రానికి పాన్ ఇండియా స్థాయిలో బజ్ రావడానికి కారణం ప్రభాస్ అనడంలో సందేహం లేదు. కన్నప్ప మీద ఏకంగా రూ.200 కోట్ల బడ్జెట్ పెట్టారన్నా అందుక్కారణం ప్రభాసే. దేశవ్యాప్తంగా ప్రభాస్‌కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నేపథ్యంలో ఈ సినిమాను ఎక్కువ మంది ప్రేక్షకులు చూస్తారని చిత్ర బృందం ఆశిస్తోంది. మరి ప్రభాస్ ఈ సినిమాలో ఎంతసేపు కనిపిస్తాడు.. సినిమాలో తన పాత్ర ఎంట్రీ ఎప్పుడు ఉంటుంది. అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. ప్రభాస్ చేసిన రుద్ర పాత్ర దాదాపు అరగంటసేపు ఉండొచ్చని మంచు విష్ణు ఇప్పటికే వెల్లడించాడు.
ఇప్పుడు రచయిత బీవీఎస్ రవి.. ప్రభాస్ క్యారెక్టర్ విషయంలో మరింత క్లారిటీ ఇచ్చాడు. కన్నప్ప ప్రి రిలీజ్ ఈవెంట్లో రవి మాట్లాడుతూ.. మంచు విష్ణు, ప్రభాస్‌ల పాత్రల గురించి.. వీరి మధ్య వచ్చే సన్నివేశాల గురించి.. అలాగే సినిమా గురించి గొప్ప ఎలివేషన్ ఇచ్చాడు. ప్రభాస్ పాత్ర ద్వితీయార్ధంలో ( సెకండ్ హాఫ్ ) ఉంటుందని అతను వెల్లడించాడు. ఇంటర్వెల్ తర్వాత సరిగ్గా 15వ నిమిషంలో ప్రభాస్ పాత్ర సినిమాలోకి ప్రవేశిస్తుందని… అక్కడ్నుంచి సినిమా వేరే లెవెల్లో ఉంటుందని అతను చెప్పాడు. 27 నిమిషాల పాటు ప్రభాస్, విష్ణు మధ్య వచ్చే సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయని.. మొత్తంగా ద్వితీయార్ధం అదిరిపోతుందని అతను చెప్పాడు.
ఓవరాల్‌గా కన్నప్ప సినిమా మామూలుగా ఉండదని.. ఇది చరిత్ర సృష్టించే సినిమా అవుతుందని బీవీఎస్ రవి ధీమా వ్యక్తం చేశాడు. మోహన్ బాబు పాత్ర, ఆయన నటన సైతం గొప్పగా ఉంటాయన్నాడు రవి. మంచు విష్ణు గురించి మాట్లాడుతూ.. మోహన్ బాబుకు సారీ చెప్పి, ఈ సినిమాలో అతను తండ్రిని మించిపోయాడని పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు రవి. విష్ణు ఎంతో కమిట్మెంట్ ఉన్న నటుడని.. కన్నప్ప కోసం ప్రాణం పెట్టి నటించాడని.. అలాగే డబ్బింగ్ విషయంలో ఎంతో జాగ్రత్త తీసుకున్నాడని.. తెలుగులో చిన్న తప్పు కూడా లేకుండా పర్ఫెక్ట్‌గా డైలాగులు చెప్పాడని.. తన కష్టానికి కన్నప్ప మంచి ఫలితాన్ని అందిస్తుందని రవి పేర్కొన్నాడు. రవి ఇంతకుముందు కూడా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను కన్నప్ప ఫస్టాఫ్ చూశానని.. సినిమా మామూలుగా ఉండదని ఎలివేషన్ ఇచ్చాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates