కుబేర.. మొత్తం మారిపోయింది

ధనుష్ తమిళంలో మిడ్ రేంజ్ స్టార్. అతడి ఖాతాలో వంద కోట్ల సినిమాలున్నాయి. తన సినిమా రిలీజవుతుంటే.. అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా జరుగుతాయి. తొలి రోజు మార్నింగ్ షోలకు ఈజీగా హౌస్ ఫుల్స్ పడిపోతాయి. కానీ తన కొత్త చిత్రం ‘కుబేర’ విషయంలో మాత్రం భిన్నమైన పరిస్థితి కనిపించింది. ధనుష్ చివరి సినిమా ‘రాయన్’ హిట్ అయినా సరే.. ‘కుబేర’కు క్రేజ్ రాకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఐతే ఇది బేసిగ్గా తెలుగు దర్శకుడు తీసిన తెలుగు చిత్రం కావడం .. మాస్ అంశాలు మిస్ కావడం.. ప్రోమోలు కనెక్ట్ కాకపోవడం.. ఇలా రకరకాల కారణాలు తోడై సినిమాకు బజ్ క్రియేట్ కాలేదు. ధనుష్ స్టార్ అయ్యాక అతి తక్కువగా అడ్వాన్స్ బుకింగ్స్ అయిన సినిమాగా ఇది నిలిచింది.

కానీ ధనుష్ మాత్రం సినిమా మీద చాలా ధీమాగా కనిపించాడు. రిలీజ్ తర్వాత పరిస్థితి మారిపోతుందని ఆశించాడు. ఇప్పుడు అదే జరుగుతోంది. నిన్న మార్నింగ్ షోలు పూర్తయ్యాయో లేదో.. తమిళనాట ‘కుబేర’ బుకింగ్స్ ఒక్కసారిగా ఊపందుకున్నాయి. మ్యాట్నీ షోల నుంచే థియేటర్లు ఫుల్ కావడం మొదలైంది. సాయంత్రానికి టికెట్లు దొరకడం కష్టమయ్యే పరిస్థితి. సినిమాకు అదిరిపోయే టాక్ రావడం.. ధనుష్ పెర్ఫామెన్స్ అద్భుతం అని అందరూ కొనియాడడం.. రివ్యూలు కూడా ఫుల్ పాజిటివ్‌గా రావడంతో చెన్నై సహా ప్రధాన నగరాల్లో ‘కుబేర’ థియేటర్లు జనాలతో నిండిపోయాయి.

కెరీర్లో ఇప్పటికే ఎన్నో అద్భుతమైన పెర్ఫామెన్స్‌లు ఇచ్చినప్పటికీ.. ‘కుబేర’లో ధనుష్ నటన వేరే లెవెల్ అని.. అతడికి మరో జాతీయ అవార్డు వస్తే ఆశ్చర్యం లేదని అంటున్నారు. మన శేఖర్ కమ్ముల మీద తమిళ జనాలు ప్రశంసలు కురిపిస్తున్నారు. అతణ్ని అరుదైన దర్శకుడిగా కొనియాడుతున్నారు. గొప్ప కథ రాసి.. మంచి ఇంటెన్షన్‌తో సినిమా తీశాడని.. ఇలాంటి సినిమాకు మంచి ఫలితాన్ని అందించాల్సిన బాధ్యత ప్రేక్షకులపై ఉందని అక్కడి క్రిటిక్స్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు అభిప్రాయపడుతున్నారు. తెలుగులో సైతం ‘కుబేర’ వసూళ్లు నిన్న సాయంత్రానికి బాగా పుంజుకున్నాయి. వీకెండ్లో సినిమా భారీ వసూళ్లే సాధించేలా ఉంది. ‘కుబేర’కు లాంగ్ రన్ కూడా ఉంటుందని ఆశిస్తున్నారు.