కన్నప్ప ఈవెంట్ ఫిక్స్.. ప్రభాస్ వస్తాడా?

టాలీవుడ్ నుంచి ఈ ఏడాది రాబోతున్న భారీ చిత్రాల్లో ‘కన్నప్ప’ ఒకటి. గత ఏడాదే విడుదల కావాల్సిన ఈ చిత్రం.. విజువల్ ఎఫెక్ట్స్, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఆలస్యం వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు జూన్ 27న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెస్తోంది చిత్ర బృందం. ఇటీవలే ట్రైలర్ లాంచ్ చేయగా.. మంచి స్పందనే వచ్చింది. హీరో కమ్ ప్రొడ్యూసర్ మంచు విష్ణు కొన్ని నెలల ముందు నుంచే ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాను ప్రమోట్ చేస్తున్నాడు.
ఇప్పుడిక ప్రమోషన్లలో అత్యంత కీలకమైన ఈవెంట్‌కు రంగం సిద్ధమైంది. ‘కన్నప్ప’ ప్రి రిలీజ్ ఈవెంట్‌ను ఈ శనివారమే హైదరాబాద్‌లో నిర్వహించబోతున్నారు.

మామూలుగా అయితే మంచు ఫ్యామిలీ హీరోల సినిమాల ప్రి రిలీజ్ ఈవెంట్లకు మరీ హైప్ ఏమీ ఉండదు కానీ.. ‘కన్నప్ప’ సంగతి వేరు. ఈ సినిమాలో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ లాంటి భారీ తారాగణం ఉంది. దీంతో ఈ ఈవెంట్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగానే ఎదురు చూస్తున్నారు. ప్రి రిలీజ్ ఈవెంట్‌కు అనుమతులు వచ్చేశాయని.. వేదిక, ఇతర వివరాలను ప్రకటించబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే కేరళ ఈవెంట్లో భాగమైన మోహన్ లాల్.. తెలుగు ఈవెంట్ కోసం హైదరాబాద్‌కు రానున్నాడు. ముంబయిలో ప్రెస్ మీట్లో పాల్గొన్న అక్షయ్ కుమార్ సైతం ఈ ఈవెంట్‌కు హాజరవుతాడట. కాజల్ అగర్వాల్, శరత్ కుమార్, మధుబాల.. ఇలా ముఖ్య తారాగణమంతా ఈవెంట్లో పాల్గొంటుంది. ఇక ఈ సినిమాలో రుద్ర అనే పాత్ర చేసిన ప్రభాస్ సంగతే తేాలాల్సి ఉంది.


రుద్ర పాత్ర కోసం పారితోషకం కూడా తీసుకోకుండా ఉచితంగా నటించాడు ప్రభాస్. విష్ణు రెమ్యూనరేషన్ ఇవ్వజూపినా తీసుకోలేదు. ప్రి రిలీజ్ ఈవెంట్‌కు రావాలన్నా ప్రభాస్ అభ్యంతరం చెప్పకపోవచ్చు. కాకపోతే ‘పుష్ప-2’ రిలీజ్ టైంలో సంధ్య థియేటర్ తొక్కిసలాట జరిగినప్పటి నుంచి పెద్ద హీరోల సినిమాల ఈవెంట్లను భారీ స్థాయిలో నిర్వహించాలంటే సినీ జనాలు భయపడుతున్నారు. పోలీసులు కూడా అంత ఈజీగా అనుమతులు ఇచ్చే పరిస్థితి లేదు. గత ఏడాది ‘దేవర’ ఈవెంట్ ముంగిట జరిగిన రభసతో ఆ కార్యక్రమాన్నే రద్దు చేశారు. ప్రభాస్ వస్తున్నాడు అంటే అభిమానుల హంగామా మామూలుగా ఉండదు. ఈవెంట్ నిర్వహణ కష్టమవుతుంది. ఈ నేపథ్యంలో ప్రభాస్ ఈవెంట్‌కు రాకుండా వీడియో బైట్ మాత్రమే ఇచ్చి సరిపెట్టే అవకాశాన్నీ కొట్టిపారేయలేం. అలా ప్రభాస్ ఈవెంట్‌కు రాడని కూడా కచ్చితంగా చెప్పలేం.