టెక్నాలజీ ప్రపంచంలో కొత్త సినిమాలు వస్తే చాలు ఎవరైనా రివ్యూలు ఇచ్చేలా పరిస్థితి మారిపోయింది. కేవలం మీడియాలోనే కాదు యూట్యూబ్ ని వేదికగా చేసుకుని సమీక్షలు చేస్తూ లక్షలాది వ్యూస్ తో డబ్బు సంపాదించుకుంటున్న ఇన్ఫ్లూయెన్సర్లు వేలల్లో ఉన్నారు. కొన్నిసార్లు వీళ్ళు హద్దులు మీరిన దాఖలాలు లేకపోలేదు. అయితే ఒక దర్శకుడు వీటికి ఎదురీది ఏకంగా పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళిపోయాడు. అదేంటో చూద్దాం. గత వారం జూన్ 13న మలయాళంలో వ్యసన సమేతం బంధుమిత్రాదికల్ రిలీజయ్యింది. దీనికి టాలీవుడ్ షైన్ స్క్రీన్స్ అధినేత కం మెగా 157 నిర్మాత సాహు గారపాటి ప్రొడక్షన్ పార్ట్ నర్.
వ్యసన సమేతం బంధుమిత్రాదికల్ కు రిపోర్ట్స్ బాగానే ఉన్నాయి. బుక్ మై షో ట్రెండింగ్ లో ఉంది. అయితే సినీఫైల్స్ అనే యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు బిజిత్ విజయన్ తాను డిమాండ్ చేసినంత డబ్బు ఇవ్వకుంటే నెగటివ్ రివ్యూ చెబుతానని ఈ సినిమా దర్శకుడు కం సహ నిర్మాత ఎస్ విపిన్ ని బెదిరించాడట. అయితే ఇందుకు అతను అంగీకరించకపోవడంతో మూవీ గురించి బ్యాడ్ రివ్యూ ఇచ్చేసి దానికి పని చేసిన వాళ్ళను బెదిరించడం మొదలుపెట్టాడట. దీంతో ఒళ్ళు మండిన విపిన్ కేరళలోని పాలరిపట్టం పోలీస్ స్టేషన్ కు వెళ్ళిపోయి కంప్లయింట్ ఇచ్చాడు. ప్రస్తుతం విచారణ జరుగుతోంది.
అయినా ఉద్దేశపూర్వకంగా డబ్బులు ఆశించి ఇలా నెగటివ్ చేయడం ఎంత మాత్రం కరెక్ట్ కాదు. ఒకవేళ నిజంగా సినిమా బాలేకపోతే ఆడియన్స్ బలవంతంగా చూడరు. రివ్యూలు బాగా ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు. అలాంటిది ఇలా బెదిరింపులకే దిగి సొమ్ములు చేసుకోవాలని చూడటం అన్యాయం. ఇదో పెద్ద మాఫియాగా మారిందని, కఠిన చర్యలు తీసుకుంటే తప్ప మార్పు రాదని విపిన్ అంటున్నారు. గత ఏడాది రివ్యూలను రిలీజ్ రోజు రాకుండా బ్యాన్ చేయాలని పలు నిర్మాతలు ప్రయత్నాలు చేశారు కానీ అవి సఫలీకృతం కాలేదు. ఇప్పుడీ ఉదంతం ఎలాంటి ఫలితాలు ఇస్తుందో వేచి చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates