ఈ సినిమా.. అవుతుందా గేమ్ చేంజ‌ర్‌?

ఓటీటీ సినిమాలంటేనే బెంబేలెత్తిపోయే ప‌రిస్థితి త‌లెత్తుతోంది. ఈ సినిమాల‌ను నిర్మాత‌లు అమ్మేసుకుని సేఫ్ అయిపోతున్నారు. ఓటీటీల‌కు వాటి వ‌ల్ల ద‌క్కాల్సిన ప్ర‌యోజ‌నం ద‌క్కుతున్న‌ట్లే ఉంది. కానీ థియేట‌ర్ వినోదం లేని ఈ రోజుల్లో ఓటీటీల్లో అయినా కొత్త సినిమాల‌ను ఎంజాయ్ చేద్దామ‌ని ఆశ‌గా చూస్తున్న ప్రేక్ష‌కుల‌కే త‌ల బొప్పి క‌డుతోంది. ఒక‌టీ అరా మిన‌హాయిస్తే ఓటీటీ సినిమాల‌న్నీ ప్రేక్ష‌కుల‌కు త‌ల బొప్పి క‌ట్టించిన‌వే.

ఈ మ‌ధ్యే తెలుగులో మిస్ ఇండియా అనే సినిమా రిలీజైంది. దాని గురించి ఎంత త‌క్కువ మాట్లాడితే అంత మంచిది. హిందీలో భారీ అంచ‌నాల‌తో విడుద‌లైన ల‌క్ష్మి కూడా చెత్త సినిమా అని తేల్చేశారు. ఇలాంటి త‌రుణంలో అంద‌రి ఆశ‌లూ సూర్య సినిమా ఆకాశం నీ హ‌ద్దురా (త‌మిళంలో సూరారై పొట్రు) మీదే నిలిచాయి.

ఇప్ప‌టిదాకా ద‌క్షిణాదిన రిలీజైన సినిమాల్లోకెల్లా ఇది పెద్ద‌ది. సూర్య లాంటి హీరో సినిమా థియేట్రిక‌ల్ రిలీజ్ స్కిప్ చేసి ఓటీటీలో నేరుగా విడుద‌ల కావ‌డం అన్న‌ది న‌మ్మ‌శ‌క్యం కాని విష‌యం. ఐతే ఎప్ప‌టిక‌ప్పుడు ట్రెండుకు త‌గ్గ‌ట్లుగా మారుతూ ఉండే సూర్య త‌న సినిమాను ఓటీటీ రిలీజ్‌కు రెడీ చేసేశాడు. ఇది సౌత్‌లో ఓటీటీలో వ‌స్తున్న అతి పెద్ద సినిమా మాత్ర‌మే కాదు.. మోస్ట్ ప్రామిసింగ్ మూవీ కూడా. అంచ‌నాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి.

ఎయిర్ డెక్క‌న్ వ్య‌వ‌స్థాప‌కుడు గోపీనాథ్ జీవిత క‌థ ఆధారంగా తెలుగ‌మ్మాయి సుధ కొంగ‌ర ఈ చిత్రాన్ని రూపొందించింది. ఈ సినిమా ప్రోమోల‌న్నీ చాలా ప్రామిసింగ్‌గా అనిపించాయి. అవి చూస్తే ఒక పాజిటివ్ ఫీల్ క‌లిగింది. విష‌య‌మున్న క‌థ‌, సరైన ప్రెజెంటేష‌న్, గొప్ప న‌టుడు.. ఇలా అన్నీ బాగా అమ‌రిన సినిమాలా క‌నిపిస్తున్న ఈ చిత్రం బుధ‌వారం అర్ధ‌రాత్రి నుంచి అమేజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ కానుంది. మ‌రి ఓటీటీ సినిమాలంటే బెంబేలెత్తిపోయే ట్రెండును మార్చి ఈ చిత్రం గేమ్ చేంజ‌ర్ అవుతుందేమో చూడాలి.