కొత్త హీరోయిన్‌ టాలెంటుకి ఫిదా

అనంతిక సనిల్‌కుమార్.. ‘మ్యాడ్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన మలయాళ భామ. టీనేజీ అమ్మాయే అయినా ఆ సినిమాలో క్యూట్‌గా కనిపిస్తూ, చక్కగా నటిస్తూ ఆకట్టుకుంది. అందులో ఆమెను చూసి ఇంప్రెస్ అయ్యే యువ దర్శకుడు ఫణీంద్ర నర్సెట్టి ‘8 వసంతాలు’ సినిమాలో అవకాశమిచ్చాడు. ఇది హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా. పైగా పెర్ఫామెన్స్‌కి బాగా స్కోప్ ఉన్నది. ఈ అవకాశాన్ని అనంతిక బాగానే సద్వినియోగం చేసుకున్నట్లే కనిపిస్తోంది ఈ సినిమా టీజర్లు, ట్రైలర్ చూస్తే. 

ఇక మంగళవారం రాత్రి జరిగిన ‘8 వసంతాలు’ ప్రి రిలీజ్ ఈవెంట్లో అనంతిక టాలెంట్ చూసి అందరూ ఔరా అనుకున్నారు. ఈ అమ్మాయిలో ఇన్ని కళలున్నాయా అంటూ నోరెళ్లబెట్టి చూశారు. తన స్టేజ్ పెర్ఫామెన్స్ మామూలుగా సాగలేదు మరి. అవంతిక ట్రైన్డ్ క్లాసికల్ డ్యాన్సర్. ఈ ప్రతిభను సినిమాలోనే కాదు.. స్టేజ్ మీద కూడా చూపించింది అనంతిక. ‘సాగర సంగమం’లోని ఓ పాటకు ఆమె అద్భుతంగా అభినయించింది. ఇది ఒకెత్తయితే.. అనంతిక మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యం మరో ఎత్తు. ఈ సినిమాలో తన పాత్ర కోసం ఒక చైనీస్ మార్షల్ ఆర్ట్‌ను నేర్చుకుంది అనంతిక. ట్రైలర్లో చూపించిన ఒక యాక్షన్ సీక్వెన్స్‌లో ఆ నైపుణ్యం కనిపించింది. స్టేజ్ మీద తన ప్రతిభ మరింత ఎలివేట్ అయింది. 

సినిమా కోసం ట్రైనింగ్ అంటే ఏదో మొక్కుబడిగా చేసి ఉంటారని చాలామంది అనుకుంటారు కానీ.. అనంతిక చాలా సీరియస్‌గానే ఈ యుద్ధ కళను నేర్చుకుని, అందులో మంచి నైపుణ్యం సంపాదించిందని స్టేజ్ పెర్ఫామెన్స్ చూస్తే అర్థమైంది. ఇక అనంతిక ప్రసంగం కూడా సుదీర్ఘంగా సాగి ఆకట్టుకుంది. ఆమె చక్కటి తెలుగులో మాట్లాడ్డం విశేషం. టైం అయిపోతుందని యాంకర్ సుమ మైక్ తీసుకునే ప్రయత్నం చేసినా.. ఆమె ఇవ్వకుండా అలాగే మాట్లాడుతూ సాగడం విశేషం. చివరికి అతి కష్టం మీద సుమ ఆమె నుంచి మైక్ తీసుకుంది.