8 వసంతాల దర్శకుడు ఫణింద్ర నరిశెట్టి ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ ని విమర్శించాలంటే దానికో అర్హత ఉండాలని చేసిన కామెంట్లు చాలా వైరలయ్యాయి. బాలేని సినిమా మీద అభిప్రాయం చెప్పడానికి చదువు, వయసుతో సంబంధం ఏంటని నెటిజెన్లు గట్టిగానే తలంటారు. నిన్న జరిగిన ఇదే మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మరో వ్యాఖ్య ద్వారా ఇంకో చర్చకు దారి తీశాడు. ఒక పది నిముషాలు పెన్ను పక్కన పెడితే తానూ కమర్షియల్ చిత్రాలు తీయగలనని, కాకపోతే తీయలేక కాదు, తీయాలని లేకపోవడం వల్ల అంటూ పెద్ద స్టేట్ మెంట్ ఇచ్చాడు. మరోసారి ట్రిగ్గరయ్యాడు.
ఆర్ట్ ఫార్మ్ (కళ రూపం) కు హద్దులు, పరిమితులు ఉండవు. సృజనాత్మకత ఏ రూపంలో అయినా ఉండొచ్చు. పైకి కమర్షియల్, మాస్ కథలు తేలిగ్గా కనపడతాయి కానీ వాటిని రాసుకోవడం, తెరకెక్కించడం అంత సులభం కాదు. ఒకవేళ అంత ఈజీ అయితే పుష్ప, కెజిఎఫ్ లాంటివి అయిదారు సంవత్సరాలు తీయరుగా. కేవలం మసాలాలు ఉన్నంత మాత్రాన సినిమాలు హిట్టయిపోవు. రామ్, నితిన్ లాంటి టాలెంట్ ఉన్న హీరోలు డిజాస్టర్లు చూసింది వీటి వల్లే కాదా. అంత పెద్ద చిరంజీవి వాల్తేరు వీరయ్య వర్కౌట్ అయ్యింది కానీ భోళా శంకర్ అడ్రెస్ లేకుండా పోయింది. తేడా కొట్టింది హీరో వల్ల కాదు. దర్శకుల రాత ప్లస్ తీత వల్ల.
సో పది నిముషాలు కాదు పది నెలలు పక్కన పెట్టినా వందల కోట్లతో ముడిపడిన కమర్షియల్ సినిమాలు తెరకెక్కించడం ఈజీ కాదనేది డిబేట్ అక్కర్లేని టాపిక్. అఖండతో రికార్డులు బద్దలు కొట్టిన బోయపాటి శీనునే స్కందతో మెప్పించలేకపోయాడు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉదాహరణలున్నాయి. ఆ మాటకొస్తే 8 వసంతాలు లాంటివి తీయడమే ఈజీ అని, ఒకవేళ హిట్టయినా ఫ్లాప్ అయినా నిర్మాతలకు నష్టం తక్కువగా ఉంటుందని, కానీ పుష్ప లాంటివి పోతే నిర్మాత మునిగిపోతాడనే లాజిక్ కి సమాధానం ఏంటో వేరే చెప్పాలా. మొత్తానికి అర్హత, కమర్షియల్ కాన్సెప్ట్స్ వల్ల నరేంద్రకు మంచి పాపులారిటీ వచ్చేసింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates