ఈ రోజు రిలీజైన ‘రాజాసాబ్’ టీజర్ అంచనాలను మించిపోయింది. ఆల్రెడీ టీజర్ చూసిన వాళ్లు దీని గురించి కొన్ని రోజులుగా ఇస్తున్న హైప్‌లో అతిశయోక్తి ఏమీ లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రభాస్ ఫ్యాన్స్ అయితే టీజర్ చూశాక మామూలు ఆనందంలో లేరు. డిసెంబరు 5న దేశవ్యాప్తంగా థియేటర్లలో సంబరాలు వేరే లెవెల్లో ఉంటాయని వాళ్లు భావిస్తున్నారు. మారుతి చాలా టైం తీసుకుని తన బలమైన హార్రర్ కామెడీ జానర్‌లో అద్భుతమైన విజువల్స్‌తో ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్‌ను అందించబోతున్నాడని టీజర్ సంకేతాలు ఇచ్చింది.
ఐతే టీజర్లో ప్రతి ఫ్రేమ్ ఆకట్టుకున్నుప్పటికీ.. ఒక్క విషయంలో మాత్రం అసంతృప్తిని మిగిల్చింది. ఇంతకుముందు మోషన్ పోస్టర్లో చూపించిన ప్రభాస్ సెకండ్ క్యారెక్టర్ ఇందులో మిస్సయింది. అందులో రాజు లుక్‌లో ప్రభాస్‌ను చూసి ప్రేక్షకులు సర్ప్రైజ్ అయ్యారు. ‘చంద్రముఖి’లో రజినీ వేసిన రాజు పాత్ర తరహాలో కనిపించింది ఆ క్యారెక్టర్. టీజర్లో ఆ పాత్రను చూపిస్తారని అనుకున్నారు. కానీ దాని ఊసే లేకపోయింది. ఒక్క సీన్ లో మాత్రం తలకిందులుగా 2 సెకన్లలో చూపించారు కానీ, దాన్ని పసిగట్టడానికే చాలా సార్లు చూడాల్సి వచ్చింది. మారుతి ఉద్దేశపూర్వకంగానే ఆ పాత్రను దాచి పెట్టినట్లు కనిపిస్తోంది. టీజర్ వరకు ప్రభాస్ యంగ్ క్యారెక్టర్‌ను మాత్రమే చూపించాడు.
భూతంగా మారిన రాజు పాత్రలో సంజయ్ దత్‌ను చూపించాడు. బహుశా ఈ పాత్రకు, రాజుగా ప్రభాస్ క్యారెక్టర్‌కు ఏదైనా లింక్ ఉండొచ్చు. ఆ క్యారెక్టర్ ఫ్లాష్ బ్యాక్‌లో రావచ్చు. లేదా దాన్ని ఎదుర్కోవడానికి ప్రభాస్ వర్తమానంలోనే రాజు అవతారంలోకి మారొచ్చు. టీజర్ వరకు యంగ్ ప్రభాస్‌ను మాత్రమే చూపించి.. ట్రైలర్ కోసం దాన్ని దాచి పెట్టి ఉండొచ్చని.. లేదా నేరుగా సినిమాలోనే ఆ పాత్రతో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేలా మారుతి ప్లాన్ చేసి ఉంటాడని అనుకుంటున్నారు.
టీజర్లో ఈ క్యారెక్టర్ లేకపోవడం పట్ల కొంత అసంతృప్తి ఉన్నా.. రేప్పొద్దున మాత్రం ఆ క్యారెక్టరే హైలైట్ అయితే ఆశ్చర్యం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పీపుల్స్ మీడియా సంస్థ ప్రొడ్యూస్ చేసిన ఈ చిత్రంలో ప్రభాస్ సరసన మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ నటించారు. డిసెంబరు 5న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates