టాలీవుడ్లో ప్రతినాయక ఛాయలున్న పాత్రలను కూడా అద్భుతంగా పండించగల హీరోల్లో గోపీచంద్ ఒకడు. ముందు హీరోగానే పరిచయం అయినా.. తర్వాత జయం, వర్షం, నిజం చిత్రాల్లో విలన్‌గా అదరగొట్టి తన ప్రత్యేకతను చాటుకున్నాడు గోపీ. ‘యజ్ఞం’తో బ్రేక్ రావడంతో ఆ తర్వాత అతను హీరోగానే స్థిరపడిపోయాడు. మళ్లీ విలన్ పాత్రల జోలికి వెళ్లలేదు. అయితే ‘గౌతమ్ నంద’లో ద్విపాత్రాభినయం చేస్తూ ఒక పాత్రలో నెగెటివ్ షేడ్స్‌ను భలేగా చూపించడంతో అతణ్ని మళ్లీ విలన్‌గా చూడాలన్న ఆశలు తన అభిమానుల్లో కలిగాయి.
ముఖ్యంగా గోపీచంద్‌కు అత్యంత సన్నిహితుడైన ప్రభాస్ సినిమాలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేస్తే అదిరిపోతుందని.. ఇప్పుడు ప్రభాస్ ఇమేజ్ మారిపోయిన నేపథ్యంలో తన సినిమాలో గోపీ ఉంటే చాలా బాగుంటుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతుంటారు. ముఖ్యంగా ‘సలార్’లో పృథ్వీరాజ్ సుకుమారన్ చేసిన పాత్రలో గోపీ ఉండుంటే ఎలా ఉండేదన్న చర్చ ఇప్పటికే నడిచింది. తాజాగా గోపీకి సంబంధించిన ఒక పోస్టర్.. ఆ చర్చకు మళ్లీ అవకాశమిచ్చింది. ‘ఘాజీ’ ఫేమ్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో గోపీ చేస్తున్న కొత్త సినిమా నుంచి తన ఫస్ట్ లుక్‌ను ఈ రోజే రిలీజ్ చేశారు. అందులో ఫెరోషియస్ లుక్‌లో గోపీ అదరగొట్టేశాడని చెప్పాలి. బాహుబలిని గుర్తు చేసేలా ఉంది ఆ లుక్. అదే సమయంలో ‘సలార్’లో పృథ్వీరాజ్ పాత్రనూ గుర్తుకు తెస్తోంది.
దీంతో ఫ్యాన్స్ ‘సలార్’లో వరద పాత్రకు గోపీని దర్శకుడు ప్రశాంత్ నీల్ ఎందుకు కన్సిడర్ చేయలేదా అని ఆశ్చర్యపోతున్నారు. కనీసం ప్రభాస్ అయినా ఆ పాత్రకు గోపీని సజెస్ట్ చేసి ఉండాల్సిందని.. ఈ ఇద్దరు మిత్రులు ఆ సినిమాలో కనిపించి ఉంటే సినిమా మన ఆడియన్సుకి ఇంకా బాగా కనెక్ట్ అయ్యేదని అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు మిస్సయినా.. భవిష్యత్తులో అయినా మళ్లీ గోపీతో ప్రభాస్ సినిమా చేయాలని.. ‘వర్షం’ తర్వాత ఈ జోడీకి అది మరపురాని సినిమా అవుతుందని వీళ్లిద్దరి మ్యూచువల్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates