ఎన్టీఆర్ ఎఫెక్ట్.. కుమార‌స్వామి క‌థ‌ను త‌వ్వుతున్నారు

సోష‌ల్ మీడియాలో ఈ రోజు ఉన్న‌ట్లుండి ఒక దేవుడి గురించి డిస్క‌ష‌న్ మొద‌లైంది. నేష‌న‌ల్ వైడ్ ఆ దేవుడి క‌థ గురించి తెలుసుకునే ప్ర‌య‌త్నం జ‌రుగుతోంది. ఇదంతా ఎన్టీఆర్, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్లో రాబోతున్న సినిమా ఎఫెక్ట్ అన‌డంలో సందేహం లేదు. ఆ దేవుడు ఎవ‌రో కాదు.. కుమార‌స్వామి, మురుగ దేవా అనే మారు పేర్లు కూడా ఉన్న సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామి. అల్లు అర్జున్‌తో చేయాల‌నుకుని.. ఇప్పుడు ఎన్టీఆర్‌కు మారిన సినిమా క‌థ సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామికి సంబంధించిన‌ద‌ని.. తెలుగులోనే కాక ఇండియాలో వ‌చ్చిన ఏ మైథాల‌జీ సినిమాల్లోనూ పెద్ద‌గా టచ్ చేయ‌ని ఈ క‌థ‌ను త్రివిక్ర‌మ్ భారీ స్థాయిలో చేయ‌డానికి రంగం సిద్ధం చేసుకున్నాడ‌ని.. వ‌చ్చే ఏడాది ఈ మెగా మూవీ సెట్స్ మీదికి వెళ్ల‌నుంద‌ని వార్త‌లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే.

ఈ న్యూస్ బ్రేక్ అయిన‌ప్ప‌టి నుంచి సోష‌ల్ మీడియా జ‌నాలు సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామి గురించి తెలుసుకునే ప్ర‌య‌త్నంలో ప‌డ్డారు. ఆయ‌న శివ‌పార్వ‌తుల రెండో కొడుకు అన్న సంగ‌తి తెలిసిందే. దేవుళ్ల‌లో అంత‌గా పాపుల‌ర్ కాని వాళ్ల‌లో సుబ్ర‌హ్మ‌ణ్య స్వామి ఒక‌రు. శివుడి పెద్ద కొడుకు వినాయ‌కుడు ఎంత పాపుల‌రో కొత్త‌గా చెప్పాల్సిన ప‌ని లేదు. వినాయ‌క చ‌వితిని మ‌న దేశంలో ఘ‌నంగా జ‌రుపుతారు. అలాగే ఆ గుడి లేని ఊర్లు క‌నిపించ‌వు. ఐతే సుబ్ర‌హ్మ‌ణ్య స్వామి దేవాల‌యాలు ఎక్కువగా త‌మిళ‌నాడులోనే ఉంటాయి. ఆయ‌న ఆ రాష్ట్రంలో కొలువై ఉండ‌డ‌మే అందుక్కార‌ణం.

సుబ్ర‌హ్మణ్య‌స్వామి గురించి ఎక్కువ మందికి తెలిసిన క‌థ ఒక్క‌టే. త‌న ఇద్ద‌రు కొడుకుల్లో ఎవ‌రు ముందుగా ముల్లోకాల‌ను చుట్టి వ‌స్తార‌ని శివుడు ప‌రీక్ష పెడితే.. కుమార‌స్వామి ప్ర‌యాణం మొద‌లుపెడ‌తాడు. ఈలోపు వినాయ‌కుడు త‌న తెలివి చూపించి శివ‌పార్వ‌తుల చుట్టూ తిర‌గ‌డంతో ముల్లోకాల‌ను చుట్టేసినట్లు అవుతుంది. క‌ష్ట‌ప‌డి ముల్లోకాలు తిరిగి వ‌చ్చిన కుమార‌స్వామి.. అన్న చేసిన ప‌నికి బాధ ప‌డి వెళ్లి త‌మిళ‌నాడులోని తిరుత్త‌ణిలో కొలువ‌వుతాడు.

ఇంత‌కుమించి కుమార‌స్వామి గురించి సామాన్య జ‌నానికి తెలిసింది త‌క్కువ‌. ఐతే ఆయ‌న క‌థ‌లో ఇంకా అనేక కోణాలున్నాయ‌ని.. పెద్ద‌గా పాపుల‌ర్ కాని కుమార‌స్వామి క‌థ‌ను ఈ త‌రానికి ఒక విజువ‌ల్ వండ‌ర్‌లా చూపించాల‌ని త్రివిక్ర‌మ్ సంక‌ల్పించాడు. కుమార‌స్వామి పాత్ర‌కు ఎన్టీఆర్ పర్ఫెక్ట్‌గా సూట‌వుతాడ‌ని.. ఈ సినిమా చ‌రిత్ర సృష్టించ‌డం ఖాయ‌మ‌ని అభిమానులు ఎగ్జైట్ అవుతున్నారు.