సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ విడుదల ఆగస్ట్ 14 కోసం తలైవర్ ఫ్యాన్స్ ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు. ఈసారి నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్ లాంటి ఆకర్షణలు తోడవ్వడంతో అంచనాలు మాములుగా లేవు. అందులోనూ రాజమౌళిలా ఫెయిల్యూరే లేని ట్రాక్ రికార్డు మైంటైన్ చేస్తున్న దర్శకుడు లోకేష్ కనగరాజ్ బ్రాండ్ బలంగా పని చేస్తోంది. తెలుగు హక్కులకు సంబంధించి ఇంకా ఫైనల్ డీల్స్ జరగలేదని సమాచారం. అగ్ర నిర్మాణ సంస్థలు ఎవరికి వారు తమ తమ దారుల్లో ప్రయత్నాలు చేస్తుండటంతో సన్ పిక్చర్స్ ఇంకా నిర్ణయాలు తీసుకోలేదని చెన్నై రిపోర్ట్. ఇక జైలర్ కనెక్షన్ ఏంటో చూద్దాం.
రెండేళ్ల క్రితం పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన జైలర్ చాలా తక్కువ రేట్లు అమ్ముడుపోతే తెలుగు వెర్షన్ ఫైనల్ రన్ నలభై కోట్లకు మించి వసూలు చేసి ఔరా అనిపించింది. ఇప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకునే కూలికి 45 కోట్ల దాకా ఆశిస్తున్నట్టు తెలిసింది. మన నిర్మాతలేమో నలభై దాకా వచ్చి ఆగిపోయారట. ఇదే చాలా పెద్ద మొత్తం. కానీ కూలికున్న బజ్ దృష్ట్యా బ్లాక్ బస్టర్ టాక్ వస్తే ఈజీగా వంద కోట్ల గ్రాస్ దాటేస్తుందని అంచనా. అదే జరిగితే బ్రేక్ ఈవెన్ సులభంగా దాటేయడంతో పాటు కనిష్టంగా పది కోట్ల లాభాలు చేతికందుతాయి. దీన్ని ఆధారంగా చేసుకునే ఇంత రేట్ చెబుతున్నారని వినికిడి.
అన్నపూర్ణ స్టూడియోస్ తరఫున సుప్రియ ప్రయత్నాల్లో ఉంది. కూలిలో నాగార్జున నటించడం ఇక్కడ సాఫ్ట్ కార్నర్ అవ్వొచ్చు. ఇదే నాగ్ రికమండేషన్ తో ఏషియన్ సునీల్ కూడా గట్టిగా ట్రై చేస్తున్నారట. ఇక సితార సంస్థ ముందు నుంచి రేస్ లో ఉంది కానీ రేట్ దగ్గరే తటపటాయింపు ఉందని అంటున్నారు. దిల్ రాజు వైపు నుంచి శిరీష్ ట్రయిల్స్ లో ఉన్నారట. ఫైనల్ గా కూలీ ఎవరికి చిక్కుతుందనేది సస్పెన్సే. ఇక్కడ కేవలం రజని ఇమేజ్ ని పరిగణనలోకి తీసుకోవడం లేదు. లోకేష్ ట్రాక్ రికార్డు, మల్టీస్టారర్ ఫ్లేవర్, అనిరుద్ రవిచందర్ సంగీతం లాంటి ఆకర్షణలు వ్యాపారాన్ని పెద్ద ఎత్తున నిర్దేశిస్తున్నాయి.