మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కు గుంటూరు కారం తర్వాత ఏడాదిన్నర గ్యాప్ వచ్చేసింది. అల్లు అర్జున్ తో ప్లాన్ చేసుకున్న ఫాంటసీ మూవీ అట్లీ వల్ల ఆలస్యమయ్యేలా ఉండటంతో ఈలోగా మరో రెండు సినిమాలు తీసేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు గత రెండు మూడు రోజులుగా తెగ వినిపిస్తోంది. దానికి సంబంధించిన క్లారిటీ దాదాపు వచ్చేసింది. ముందుగా వెంకటేష్ ది మొదలు కానుంది. 2017 నుంచి పెండింగ్ ఉన్న ఈ కాంబో ఎట్టకేలకు కార్యరూపం దాలుస్తోంది. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత సోలో హీరోగా వెంకటేష్ ఇచ్చిన పక్కా కమిట్ మెంట్ ఇదే కానుంది. జూలైలో షూట్ మొదలుపెట్టొచ్చని సమాచారం.
వెంకీ సినిమాకు సంబంధించి రకరకాల టైటిల్స్ ఆల్రెడీ ప్రచారంలోకి వచ్చాయి. ఆనందరావు పేరు కాస్త గట్టిగా వినిపిస్తోంది. దీన్ని అయిదారు నెలల్లో పూర్తి చేసి వచ్చే సంవత్సరం వేసవికి రిలీజయ్యేలా ప్లాన్ చేస్తున్నారట. హారిక హాసిని మెయిన్ బ్యానర్ కానుండగా సురేష్ ప్రొడక్షన్స్ భాగస్వామ్యం ఉంటుందా లేదానేది అనౌన్స్ మెంట్ దాకా వేచి చూడాలి. పెద్ది రిలీజైన రెండు నెలలకు అంటే జూలై 2026లో రామ్ చరణ్ సినిమా మొదలుపెట్టేలా త్రివిక్రమ్ ప్లాన్ చేసుకున్నారట. ఈ కలయికకు ప్రేరేపించింది పవన్ కళ్యానే అనే ప్రచారం ఒకటుండగా కథకు మెయిన్ లైన్ కూడా ఆయన ఇచ్చిందేనని మరో గాసిప్.
సో ఇంకో రెండేళ్లు త్రివిక్రమ్ కు సరిపడా వర్క్ సెట్ అయిపోయింది. మరి అట్లీ మూవీ అయిపోయాక అల్లు అర్జున్ తిరిగి త్రివిక్రమ్ దగ్గరికి వస్తాడా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఇటీవలే బన్నీ వాస్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బన్నీ, త్రివిక్రమ్ ఇద్దరూ ఎప్పుడు రెడీ అంటే అప్పుడు ఆ ప్రాజెక్టు తెరకెక్కుతుందని, ఆదెప్పుడనేది తనకు తెలియదని అన్నారు. క్యాన్సిల్ వార్తలను కొట్టి పారేశారు. అల వైకుంఠపురములో ఇండస్ట్రీ హిట్ తర్వాత గుంటూరు కారం రూపంలో ఆశించిన ఫలితం అందుకోలేకపోయిన త్రివిక్రమ్ కు వెంకటేష్, రామ్ చరణ్ రూపంలో క్రేజీ కాంబోలు దొరికాయి. వాటిని నిలబెట్టుకోవాలనే ఇద్దరు ఫ్యాన్స్ కోరిక.
Gulte Telugu Telugu Political and Movie News Updates