కింగ్ డమ్ కష్టాలకు హద్దులు లేవా

ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినా కింగ్ డమ్ మళ్ళీ వాయిదా పడింది. ముందు ఈ సినిమా కోసమే తమ డేట్ ని త్యాగం చేసిన నితిన్ తమ్ముడు తిరిగి జూలై 4ని తీసేసుకుంది. ఈ మేరకు ట్విట్టర్ లో ఈ విషయాన్ని ప్రకటించడమే కాక ఎల్లుండి ట్రైలర్ లాంచ్ చేయబోతున్నారు. ఇది ముందే పసిగట్టిన విషయమే అయినప్పటికీ సితార సంస్థ మాటకు కట్టుబడి ఉంటుందేమోనని ఫ్యాన్స్ ఆశించారు. కానీ దానికి భిన్నంగా మళ్ళీ వాయిదా మంత్రం తప్పలేదు. హరిహర వీరమల్లు జూలై 18 రావడం దాదాపు ఖరారైన నేపథ్యంలో కింగ్ డమ్ ఆగస్ట్ 1కి షిఫ్ట్ అవుతుందని లేటెస్ట్ అప్డేట్. తేజ సజ్జ మిరాయ్ వదిలేసిన స్లాట్ ఇది.

సరే ఇంకో రెండు నెలలు లేట్ అయితే అయ్యింది కంటెంట్ బాగుంటే చాలని ఫ్యాన్స్ అనుకుంటున్నారు కానీ ఇక్కడింకో సమస్య ఉంది. ఒకవేళ కింగ్ డమ్ కనక ఆగస్ట్ 1 రిలీజైతే కేవలం పదమూడు రోజులు దాటడం ఆలస్యం ఒకే రోజు వార్ 2, కూలి దిగుతాయి. వాటి మీద బజ్ ఏ స్థాయిలో ఉందో చెప్పనక్కర్లేదు. కింగ్ డమ్ ఎంత మంచి టాక్ తెచ్చుకున్నా ఆగస్ట్ 14 నుంచి స్క్రీన్లను కాపాడుకోవడం పెద్ద సవాల్ అవుతుంది. సరే డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్క్ ఉంది కాబట్టి ఏదోలా మేనేజ్ చేసినా ప్రేక్షకుల దృష్టి వార్, కూలీ మీదే ఎక్కువ ఉంటాయనేది కాదనలేని వాస్తవం. సో ఆటోమేటిక్ గా డైవెర్షన్ జరిగిపోతుంది.

మార్చి నుంచి వాయిదాల పర్వంలో తడుస్తూ వచ్చిన కింగ్ డమ్ కు కేవలం పక్క సినిమాల వల్లే డేట్లు మిస్ కాలేదు. కొంత రీ షూట్ చేయాల్సి వచ్చింది. రీ రికార్డింగ్ కోసం అనిరుధ్ రవిచందర్ ఎక్కువ సమయం అడిగాడు. ప్రమోషన్లు ప్యాన్ ఇండియా స్థాయిలో జరగాలంటే కనీసం నెల రోజుల గడువు దొరకాలి. పోస్ట్ ప్రొడక్షన్ కి టైం చాలడం లేదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని హడావిడి వద్దని నెమ్మదిగా రావాలని సితార టీమ్ నిర్ణయించుకుందట. శ్రీలంక శరణార్ధుల బ్యాక్ డ్రాప్ తమిళులకు బాగా కనెక్ట్ అవుతుంది. మరి కూలికి పదమూడు రోజుల ముందు రావడం ఎలాంటి ప్రభావం చూపిస్తుందో వేచి చూడాలి.