టూరిస్ట్ ఫ్యామిలీ.. ఈ మధ్య కాలంలో సౌత్ ఇండియన్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న తమిళ చిత్రం. కోలీవుడ్లో పెద్ద హీరోలు, పెద్ద దర్శకులు పేలవమైన సినిమాలు అందిస్తున్న తరుణంలో, అభిషన్ జీవింత్ అనే కొత్త దర్శకుడు.. స్టార్లు లేకుండా చిన్న బడ్జెట్లో తీసిన ఈ ఫ్యామిలీ డ్రామా థియేటర్లలో అద్భుత ఫలితాన్ని అందుకుంది. రూ.5 కోట్ల లోపు బడ్జెట్లో తెరకెక్కిన ఈ చిత్రం.. రూ.80 కోట్ల మేర వసూళ్లు సాధించడం విశేషం. థియేట్రికల్ రిలీజ్ తర్వాత ఓటీటీలో రిలీజ్ చేస్తే అక్కడా అద్భుత స్పందన తెచ్చుకుంటోంది. తమిళేతర భాషల్లోనూ జనం ఈ సినిమాను బాగా చూస్తున్నారు. సోషల్ మీడియాలో కొన్ని వారాలుగా ఈ మూవీ ట్రెండింగ్‌లో ఉంది.
టాలీవుడ్ నుంచి రాజమౌళి, శాండిల్‌వుడ్ నుంచి కిచ్చా సుదీప లాంటి ప్రముఖులు ఈ చిత్రంపై ప్రశంసల జల్లు కురిపించారు. ముఖ్యంగా రాజమౌళి సినిమా రిలీజైన కొన్ని రోజులకే థియేటర్‌కు వెళ్లి మరీ సినిమా చూసి.. తనకు మంచి థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చినందుకు దర్శకుడికి కృతజ్ఞతలు చెబుతూ ట్వీట్ వేశారు. రాజమౌళి లాంటి మేటి దర్శకుడి నుంచి ఇలాంటి ప్రశంసలు అందుకోవడం అంటే ఒక డెబ్యూ డైరెక్టర్‌కు అంతకుమించి ఆనందం ఏముంటుంది? ఐతే రాజమౌళి పేరుతో తనకు గతంలో జరిగిన ఒక అవమానం గురించి అభిషన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు.
దర్శకుడు కావడానికి ముందు అభిషన్ ఒక స్కూల్లో టీచర్‌గా పని చేశాడట. ఆ స్కూల్ వార్షికోత్సవ వేడుకల్లో అతను ఒక నాటకాన్ని డైరెక్ట్ చేశాడట. అతను ఎంతో ఎగ్జైట్మెంట్‌తో ఆ ప్లేను డైరెక్ట్ చేయగా.. తాను సూచనలివ్వడం అదీ చూసి అక్కడున్న ఒక వ్యక్తి అవమానించేలా మాట్లాడాడట. ‘‘వీడొక పెద్ద రాజమౌళి.. బాహుబలి తీస్తున్నట్లు బిల్డప్ ఇస్తున్నాడు’’ అంటూ హేళనగా అతను మాట్లాడాడట. ఈ మాటలకు బాగా హర్టయిన అభిషన్ ఏడుస్తూ ఇంటికి వెళ్లాడట. అలాంటి తాను ఇప్పుడు ‘టూరిస్ట్ ఫ్యామిలీ సినిమా తీసి రాజమౌళి నుంచి ప్రశంసలు అందుకోవడం మరపురాని అనుభూతి అని అభిషన్ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు.