-->

ఓజీ మాత్రం పక్కా అంటే పక్కా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే చెప్పిన డేట్‌కు రాదు అనే అభిప్రాయం బలపడిపోతోంది. చాలా ఏళ్ల నుంచి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. అయినా కుదిరినపుడు వీలు చేసుకుని సినిమాల్లో నటిస్తున్నారు. కానీ పవన్ ఎప్పుడు అందుబాటులోకి వస్తారో.. ఎప్పుడు సినిమా పూర్తవుతుందో స్పష్టత ఉండట్లేదు. దీని వల్ల ఆయన చేసే ప్రతి సినిమాకూ ముందు చెప్పిన డేట్‌ మారిపోతోంది. ‘హరిహర వీరమల్లు’ అయితే ఏళ్లకు ఏళ్లు వాయిదా పడుతూ వచ్చింది. పలుమార్లు డేట్లు మార్చాక జూన్ 12ను ఎంచుకున్నారు కానీ.. ఆ తేదీకి కూడా సినిమా రావట్లేదు. ప్రస్తుతం జులైలో కొత్త డేట్ చూస్తున్నారు. త్వరలోనే డేట్ ప్రకటించబోతున్నారు. ఆ డేట్‌కు సినిమా వస్తుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది.

ఐతే ‘హరిహర వీరమల్లు’ సంగతెలా ఉన్నా.. పవన్ తర్వాతి చిత్రం ‘ఓజీ’ మాత్రం పక్కాగా చెప్పిన డేట్‌కే వస్తుందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని సెప్టెంబరు 25న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ డేట్‌కు ఇంకా మూడున్నర నెలల సమయం ఉంది. ఈలోపే పవన్ ఈ సినిమా చిత్రీకరణను పూర్తి చేసేయడం విశేషం. పవన్ ఇందులో ఓజాస్ గంభీర అనే పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన గత నెలలోనే తిరిగి ‘ఓజీ’ సెట్లోకి అడుగుపెట్టారు. కొన్ని వారాల పాటు కంటిన్యూగా అందుబాటులో ఉండి తన పాత్ర వరకు చిత్రీకరణ పూర్తి చేసేశారు. ఈ విషయాన్ని డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ అధికారికంగా ప్రకటించింది కూడా.

పవన్ పాత్రకు సంబంధించి షూట్ పూర్తయిందంటే సినిమాను ముగించడం ఇక లాంఛనమే. మిగతా ఆర్టిస్టులంతా అందుబాటులో ఉండడంతో ఇంకొన్ని వారాల్లో సినిమాకు గుమ్మడికాయ కొట్టేస్తారు. తర్వాత పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్లకు కావాల్సినంత సమయం దొరుకుతుంది. ‘హరిహర వీరమల్లు’ లాగా దీనికి బిజినెస్ సమస్యలు కూడా లేవు. మాంచి డిమాండ్ ఉంది. కాబట్టి సెప్టెంబరు 25న గ్రాండ్ సెలబ్రేషన్లకు అభిమానులు రెడీ అయిపోవచ్చు.