=

మార్కో దర్శకుడితో బాలయ్య మాస్ ?

అఖండ 2 తాండవం తర్వాత బాలకృష్ణ తర్వాత చేయబోయే మూవీ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో అనేది తెలిసిన విషయమే. లైనప్ విషయంలో స్పీడ్ తగ్గకుండా ఏడాదికి రెండు సినిమాలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న బాలయ్య దానికి అనుగుణంగానే పక్కాగా అడుగులు వేస్తున్నారు. తాజా అప్డేట్ ఏంటంటే మార్కోతో బ్లాక్ బస్టర్ మార్క్ వేసిన అనీఫ్ అదేని డైరెక్షన్ కు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ దిల్ రాజు నిర్మాణంలో పెద్ద ఎత్తున బడ్జెట్ తో రూపొందుతుందని ఇన్ సైడ్ టాక్. ఇటీవలే ఓ ఈవెంట్ లో బాలయ్య నర్మగర్భంగా హింట్ ఇచ్చింది దీని గురించే కావొచ్చు.

కాకపోతే ఇప్పుడు గోపీచంద్ మలినేని, అనీఫ్ అదానీలో ఎవరిది ముందు మొదలవుతుందనేది వేచి చూడాలి. ప్రోజెక్టుల ఎంపికలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా ప్లాన్ చేసుకుంటున్న బాలయ్య అఖండతో కలిపి వరసగా నాలుగు బ్లాక్ బస్టర్స్ సాధించారు. వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ ఏవీ నిరాశపరచకుండా మంచి విజయం సాధించాయి. అన్ స్టాపబుల్ షోకి బ్రేక్ ఇచ్చారు కానీ తిరిగి ప్రారంభమయ్యాక దాని రీచ్ వేరే లెవెల్ లో ఉంటుంది. బిగ్ బాస్ షోకు అడిగారు కానీ బాలయ్య నుంచి సానుకూల స్పందన రాలేదని తెలిసింది. మాన్షన్ హౌస్ వాటర్ కు బ్రాండ్ అంబాసడర్ గా మారిన సంగతి తెలిసిందే.

మొత్తానికి అభిమానులు మాత్రం ఇదంతా చూసి హ్యాపీగా ఫీలవుతున్నారు. ఇవి కాకుండా బాలయ్యకు అసలైన బాధ్యత మరొకటి ఉంది. మోక్షజ్ఞ ఎంట్రీకి సంబంధించి వీలైనంత త్వరగా అనౌన్స్ మెంట్ ఇచ్చేలా చూసుకోవాలి. ప్రశాంత్ వర్మతో ప్యాన్ ఇండియా మూవీ వద్దనుకున్నాక క్రిష్ చేస్తారనే ప్రచారం జరిగింది. కానీ ఇప్పటిదాకా దాన్ని సమర్ధిస్తూ లేదా ఖండిస్తూ ఎలాంటి ప్రకటన రాలేదు. ఆదిత్య 369 సీక్వెల్ గా ఆదిత్య 999 మ్యాక్స్ కోసం కథను రెడీ చేసి పెట్టుకున్న బాలయ్య దాని బాధ్యతలు క్రిష్ కి ఇస్తాడా లేక స్వీయ దర్శకత్వంలో చేస్తాడా అనేది వేచి చూడాలి. కాస్త ఎక్కువ టైం పట్టేలానే ఉంది.