=

కన్నప్ప నిడివితో రిస్క్ ఉందా

సరిగ్గా ఇంకో ఇరవై రోజుల్లో కన్నప్ప థియేటర్లకు వచ్చేస్తాడు. మంచు విష్ణు నాన్ స్టాప్ గా ప్రమోషన్లు చేస్తూ ఈ సినిమాని గ్లోబల్ ఆడియన్స్ కి చేరేందుకు ఎంత చేయాలో అంతా చేస్తున్నాడు. రాబోయే రెండు వారాల్లో ఇవి పీక్స్ కు చేరుకోబోతున్నాయి. హార్డ్ డిస్క్ చోరీ లాంటి సంఘటనలతో కొంత ఇబ్బంది తలెత్తినప్పటికీ ఫైనల్ గా తాను అనుకున్న విధంగా సినిమా వచ్చిందనే ఆనందాన్ని విష్ణు ఈ మధ్య ఇచ్చిన ఇంటర్వ్యూలలో గమనించవచ్చు. అయితే నిడివికి సంబంధించిన ఒక అప్డేట్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. కన్నప్ప నిడివి 3 గంటల 10 నిమిషాలకు లాక్ చేశారట. దాంట్లో ఆశ్చర్యం ఏముందనుకోవచ్చు.

యానిమల్, పుష్ప 2 ది రూల్ ఇంత కన్నా ఎక్కువ లెన్త్ తో వచ్చి ప్రేక్షకుల ఆదరణతో బ్రహ్మాండమైన బ్లాక్ బస్టర్స్ సాధించాయి. సో బొమ్మ బాగుంటే ఎంత సేపు థియేటర్లో కూర్చుకున్నామనేది ఆడియన్స్ లెక్కచేయరని వీటి ద్వారా అర్థమైపోయింది. కానీ ఈ రెండు సినిమాలు కమర్షియల్ ఫ్లేవర్ తో పాటు స్టార్ పవర్ బలంగా ఉన్నవి. కన్నప్పలోనూ ప్రభాస్, అక్షయ్ కుమార్ లాంటి క్యాస్టింగ్ ఉన్నారు కానీ డివోషనల్ బ్యాక్ డ్రాప్ కావడంతో అంత నిడివిని జనం అంగీకరిస్తారా అనేది అసలు ప్రశ్న. కృష్ణంరాజు గారి మొదటి కన్నప్ప లెన్త్ 2 గంటల 28 నిమిషాలే. పాటలతో కలిపి ఫైనల్ వెర్షన్ ఇంతే ఉంటుంది.

మరి మంచు విష్ణు కన్నప్పలో అదనంగా ఇంకేమేం ఉంటాయనేది తెరమీద చూడాలి. ప్రభాస్ పాత్ర అరగంట అన్నారు కాబట్టి ఇది కీలకం కానుంది. మోహన్ లాల్, మోహన్ బాబు పాత్రలు పాత కన్నప్పలో లేవు. శివుడు, పార్వతి కామన్ కానీ మిగిలిన సెటప్ అంతా కన్నప్ప టీమ్ కొత్తగా రాసుకున్నారు. మాస్ సినిమాలు ఎంత పొడవున్నా ఓకే కానీ దేవుడి నేపధ్యమున్న కన్నప్ప లాంటివి ఎక్కువసేపు పబ్లిక్ ని కూర్చోబెట్టేలా చేయాలంటే అన్నమయ్య రేంజ్ కంటెంట్ పడాలి. మంచు విష్ణు అయితే ఆ కాన్ఫిడెన్స్ తోనే ఉన్నాడు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ ఆధ్యాత్మిక చిత్రానికి స్టీఫెన్ దేవస్సి సంగీతం అందించారు.