కొన్నేళ్లుగా టాలీవుడ్లో ఎన్నో పాత సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి. కొత్త సినిమాలను మించి వాటిని ప్రేక్షకులు సెలబ్రేట్ చేస్తున్నారు. ఇటీవలే మహేష్ బాబు ఫ్లాప్ మూవీ ‘ఖలేజా’ను 4కేలోకి మార్చి రిలీజ్ చేస్తే అద్భుతమైన స్పందన వచ్చింది. దాదాపు రూ.10 కోట్ల వసూళ్ల మార్కును ఈ సినిమా అందుకుని ఔరా అనిపించింది. ఆ చిత్రం ఇంకా థియేటర్లలో ఆడుతోంది. దాని కంటే ముందు ప్రభాస్ మూవీ ‘వర్షం’ రీ రిలీజ్‌కు సైతం మంచి స్పందన వచ్చింది.
ఈ ఊపు చూశాక మరిన్ని పాత చిత్రాలను రీ రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తెలుగు ఇండస్ట్రీని గొప్ప మలుపు తిప్పిన ‘బాహుబలి’ని సైతం తిరిగి థియేటర్లలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆర్క మీడియా వర్క్స్ సంస్థ ఇందుకోసం సన్నాహాలు కూడా మొదలుపెట్టింది. ఐతే ఈ రీ రిలీజ్ విషయంలో పెద్ద ట్విస్ట్ ఉన్నట్లు సమాచారం.
‘బాహుబలి’ సింగిల్ సినిమా కాదు. ‘ది బిగినింగ్’, ‘ది కంక్లూజన్’ అంటూ రెండు పార్టులుగా విడుదలైంది. రెండూ ఒకదాన్ని మించి ఒకటి బ్లాక్ బస్టర్లు అయ్యాయి. మరి ఇప్పుడు రీ రిలీజ్ అంటే వీటిలో ఏదో ఒకటి రిలీజ్ చేస్తే అసంపూర్ణం అవుతుంది. అలా అని రెండు చిత్రాలను మార్చి మార్చి రిలీజ్ చేయాలని కూడా మేకర్స్ అనుకోవట్లేదు. రెండు చిత్రాల్లో ఆసక్తికరంగా అనిపించని ఎపిసోడ్లను పరిహరించి.. మోస్ట్ ఇంటెస్టింగ్ ఎపిసోడ్లను కలిపి ఒక భాగంగానే రిలీజ్ చేయాలని చూస్తున్నారట. ఇందుకోసం ఎడిటింగ్ పనులు మొదలయ్యాయి.
‘బాహుబలి’ రెండు భాగాలు కలిపితే నిడివి ఐదున్నర గంటల దాకా ఉంటుంది. దీన్ని మూడు-మూడున్నర గంటలకు కుదించాలని చూస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం రాజమౌళి కూడా ఒక చేయి వేస్తారా అన్నది ఆసక్తికరం. అప్పట్లో ‘బాహుబలి’ రెండు భాగాలుగా తీయడం మీద విమర్శలూ వచ్చాయి. సగం కథను చూపించారని అసంతృప్తి వ్యక్తమైంది. మరిప్పుడు ‘బాహుబలి’ని ఒక కథగా చూసే అవకాశం అంటే విశేషమే. బహుశా ముందుగా ‘బాహుబలి’ని ఒక కథగా చేయాలనుకున్నపుడు అనుకున్న వెర్షన్‌ను టీం రిలీజ్ చేసే అవకాశముంది.