ఇంకా ఏడు నెలల సమయం ఉండగానే వచ్చే ఏడాది సంక్రాంతి అప్పుడే వేడెక్కుతోంది. చిరంజీవి అనిల్ రావిపూడి కాంబోలో ‘మెగా 157’ ఒక స్లాట్ కన్ఫర్మ్ చేసుకోగా నవీన్ పోలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’ జనవరి 14 డేట్ కూడా చెప్పేసింది. వీటికన్నా ముందు విజయ్ ‘జన నాయగన్’ ఎప్పుడో స్లాట్ తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా రవితేజ ఈ రేసులో పోటీ పడేందుకు సై అంటున్నారు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందబోయే భారీ ఎంటర్ టైనర్ ని ఆ పండక్కు రిలీజ్ చేయబోతున్నట్టు ఇవాళ ఒక ప్రీ లుక్ పోస్టర్ తో అధికారికంగా ప్రకటించారు. సుధాకర్ చెరుకూరి నిర్మాతగా వ్యవహరించనున్నారు.
జానర్ గట్రా వివరాలు చెప్పలేదు కానీ లీకైన టైటిల్ అనార్కలి అనే ప్రచారం ఫిలిం నగర్ వర్గాల్లో జోరుగా ఉంది. దీన్ని బట్టి ఫన్ ప్లస్ యాక్షన్ రెండూ ఉంటాయని ఆశించవచ్చు. ఈ రోజు నుంచి షూటింగ్ ప్రారంభమవుతున్నా ఇంత కాన్ఫిడెంట్ గా పండగకు వస్తామని చెప్పడం చూస్తే ప్లానింగ్ పక్కాగా ఉన్నట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం మాస్ జాతర పూర్తి చేసే పనిలో ఉన్న రవితేజ జూన్ నుంచి ఫ్రీ అవ్వబోతున్నారు. ఇప్పుడీ అనార్కలి భారీ యాక్షన్ ఎపిసోడ్స్, విఎఫెక్స్ డిమాండ్ చేసే సబ్జెక్టు కాకపోవడంతో అనుకున్న టైంలో రావడంలో పెద్ద ఆశ్చర్యం లేదు. ఆడవాళ్ళూ మీకు జోహార్లు తర్వాత కిషోర్ తిరుమల చేస్తున్న మూవీ ఇదే.
ఇప్పటిదాకా 2026 సంక్రాంతికి నాలుగు సినిమాలు అధికారికంగా వస్తున్నట్టు చెప్పేశాయి. ఇంకేవైనా జాయినవుతాయేమో చూడాలి. ఒకవేళ అఖండ 2 కనక సెప్టెంబర్, డిసెంబర్ మిస్ చేసుకుంటే కనక ఈ లిస్టులో తోడయ్యే అవకాశాలు కొట్టి పారేయలేం. ఈగల్, టైగర్ నాగేశ్వరరావు, రావణాసుర లాంటి ప్రయోగాలతో డిజాస్టర్లు చవి చూసిన రవితేజ తిరిగి తన కమర్షియల్ స్కూల్ కు వస్తున్నాడు. మాస్ జాతర వాటిలో భాగంగా వస్తున్నదే. ఎక్స్ పెరిమెంట్లు కాకుండా అభిమానులను, ప్రేక్షకులను మెప్పించే ధమాకా లాంటివి అయితేనే వర్కౌట్ అవుతాయని భావించి ఆ దిశగా ప్లాన్ చేసుకుంటున్నారు. కిషోర్ తిరుమల సినిమా కూడా అదే క్యాటగిరినట.