చివరి నిమిషం రిపేర్లలో కింగ్ డమ్ ?

విజయ్ దేవరకొండ కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందుతున్న కింగ్ డమ్ విడుదల ఇంకో 32 రోజుల్లో కానుంది. జూలై 4 రిలీజ్ డేట్ ఇంతకు ముందే లాక్ చేయడంతో దానికి అనుగుణంగా పనులను వేగవంతం చేశారు. అయితే ఇటీవలే ఫైనల్ కట్ చూసిన దర్శకుడు గౌతమ్ తిన్ననూరి కొన్ని సన్నివేశాలను రీ షూట్ చేయాలని భావించడంతో ఆ మేరకు వాటిని గోవాలో చిత్రీకరణ చేస్తున్నట్టు సమాచారం. అఫీషియల్ అప్డేట్ ఇవ్వలేదు కానీ ప్రస్తుతం దీని మీద వర్క్ జరుగుతోందట. ఇది కాగానే బ్యాలన్స్ ఉన్న పోస్ట్ ప్రొడక్షన్ ని ఫినిష్ చేసి అనిరుద్ రవిచందర్ రీ రికార్డింగ్ కోసం ఫైనల్ కాపీ ఇవ్వాలి.

తక్కువ సమయం చేతిలో ఉండటంతో టీమ్ ఉరుకులు పరుగులు పెడుతోంది. ఈసారి వాయిదా ఛాన్స్ ఉండదు. ఎట్టి పరిస్థితుల్లో డెడ్ లైన్ మీటవ్వాల్సిందే. ఎందుకంటే మిగిలిన స్లాట్స్ వేరే సినిమాలు తీసేసుకున్నాయి. ఆగస్ట్ ఇంకా ఎక్కువగా ప్యాకయ్యింది. సో జూలై మొదటివారంని వదులుకునే దిశగా పొరపాటు చేయరు. పబ్లిసిటీ ఎలా చేయాలనే దాని గురించి ప్రస్తుతం కసరత్తు జరుగుతోంది. ప్యాన్ ఇండియా రిలీజ్ కాబట్టి దానికి అనుగుణంగా అన్ని రాష్ట్రాలు కవరయ్యేలా ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే, సత్యదేవ్ లాంటి కీలక ఆర్టిస్టుల డేట్లను ముందుగానే తీసేసుకున్నారట.

ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడం విజయ్ దేవరకొండకు చాలా కీలకం. ఎందుకంటే లైగర్, ది ఫ్యామిలీ స్టార్ వరసగా నిరాశ పరిచాయి. అయినా సరే బడ్జెట్ విషయంలో కాంప్రమైజ్ లేకుండా సితార, ఎస్విసి, మైత్రి లాంటి పెద్ద బ్యానర్లు సినిమాలు చేసేందుకు ముందుకొస్తున్నాయి. మార్కెట్ నిలబెట్టుకోవడానికి ఇప్పుడో సక్సెస్ అవసరం. శ్రీలంక శరణార్ధుల బ్యాక్ డ్రాప్ లో రూపొందిన కింగ్ డమ్ లో అణిచివేతకు గురవుతున్న వాళ్ళను కాపాడేందుకు వచ్చే నాయకుడిగా విజయ్ పాత్ర చాలా ఇంటెన్స్ గా ఉంటుందట. బిజినెస్ కు సంబంధించిన వ్యవహారాలు ట్రైలర్ తర్వాత మొదలుపెట్టొచ్చని తెలిసింది.