మనసు మార్చుకోనంటున్న అఖండ 2

సెప్టెంబర్ 25 పవన్ కళ్యాణ్ ఓజి అఫీషియల్ గా లాక్ చేసుకున్నాక దానికి పోటీ ఎవరూ రారని అందరూ భావించారు. అంతకు ముందే ఈ డేట్ తీసుకున్న బాలకృష్ణ అఖండ 2 నెక్స్ట్ డిసెంబర్ కి వెళ్లిపోవచ్చనే ప్రచారం ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ఉంది. కానీ తాజాగా వినిపిస్తున్న అప్డేట్ ప్రకారం అఖండ 2 బృందంలో అసలు అలాంటి వాయిదా ఆలోచనే లేదట. దసరా పండక్కు ఖచ్చితంగా రావాలనే సంకల్పంతోనే తన రెగ్యులర్ శైలికి భిన్నంగా దర్శకుడు బోయపాటి శీను వేగంగా షూటింగ్ చేస్తున్నట్టు సమాచారం. జార్జియా షెడ్యూల్ లో కీలకమైన ఎపిసోడ్స్ ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్విరామంగా జరిగిపోతున్నాయి.

ఒకవేళ నిజంగా అఖండ 2 కనక సెప్టెంబర్ 25 నుంచి తగ్గకపోతే ఓజితో క్లాష్ జరిగేలా ఉంది. మాములుగా బాలయ్య, పవన్ కళ్యాణ్ మధ్య సాన్నిహిత్యం దృష్ట్యా ఈ ఫేస్ అఫ్ ఉండకపోవచ్చనేది ఒక అంచనా. ఒకవేళ ఓజి అలాంటి ఆలోచన ఏదైనా చేస్తే సెప్టెంబర్ మొదటి వారానికి వెళ్లాల్సి ఉంటుంది. కానీ ఇదంతా ముందే ఊహించింది కాబోలు తేజ సజ్జ మిరాయ్ సెప్టెంబర్ 5 ని తీసేసుకుంది. ఈ మధ్యే టీజర్ లో చెప్పేశారు. అయినా సరే ఎవరి నిర్ణయాలు ఎప్పుడు ఎలా ఉంటాయో చెప్పలేని పరిస్థితి టాలీవుడ్ లో నెలకొంది. అనౌన్స్ మెంట్లు ఎన్ని ఇచ్చినా ఖచ్చితంగా మాట మీద ఉంటారని గ్యారెంటీ లేదు.

సో ఇప్పటికైతే అఖండ 2 రాకలో ఎలాంటి మార్పు లేదు. కాకపోతే చేతిలో ఉన్నది కొంచెం అటు ఇటుగా నాలుగు నెలల సమయం. ఈ లోగా మొత్తం పూర్తవుతుందా అంటే చూడాలి. తమన్ పాటలను ఇంకా షూట్ చేయాలి. రీ రికార్డింగ్ కి ఎక్కువ సమయం ఇవ్వాలి. విఎఫ్ఎక్స్ పెద్దగా అవసరం లేకుండా అఖండ తీశారు. కానీ సీక్వెల్ కి విజువల్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉన్నాయట. ఒకవేళ క్వాలిటీ కోసమో మరో కారణం కోసం పోస్ట్ పోన్ చేస్తే తప్ప ప్రస్తుతానికి అఖండ 2 పాత మాట మీదే ఉన్నాడు. జూన్ 10 బాలకృష్ణ పుట్టిస్తోరోజు. ఆ రోజు వదిలే టీజర్ లో సెప్టెంబర్ 25కి సంబంధించి ఫుల్ క్లారిటీ రానుంది. చూద్దాం.