పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కెరీర్లో ఒకే ఒక్క సినిమా డైరెక్ట్ చేశాడు. అదే.. జాని. ఆ తర్వాత ‘సత్యాగ్రహి’ పేరుతో స్వీయ దర్శకత్వంలో మరో సినిమా మొదలుపెట్టాడు కానీ.. ఏవో కారణాలతో అది ముందుకు కదల్లేదు. పవన్‌తో ‘ఖుషి’ లాంటి బ్లాక్ బస్టర్ తీసిన సీనియర్ నిర్మాత ఎ.ఎం.రత్నంయే ఈ చిత్రాన్ని కూడా ప్రొడ్యూస్ చేయాల్సింది. కానీ ముహూర్త వేడుక తర్వాత సినిమాకు బ్రేక్ పడింది. ఈ సినిమా గురించి ఈ మధ్య పవన్, రత్నం చర్చించుకున్నారట.
ఒకవేళ ఆ సినిమాను తాను పూర్తి చేసి ఉంటే.. దర్శకుడిగా స్థిరపడిపోయేవాడినని.. రాజకీయాల్లోకే వచ్చేవాడిని కాదని పవన్ రత్నంతో వ్యాఖ్యానించారట. ‘సత్యాగ్రహి’ చాలా మంచి కథ అని.. పవన్ మీద తనకు పూర్తి నమ్మకం ఉందని.. కానీ పవనే ఆ సినిమాను ఆపేశాడని రత్నం తెలిపారు. ‘జాని’ ఆడకపోవడం వల్లే పవన్ ఆ నిర్ణయం తీసుకున్నాడా అన్నది తనకు తెలియదని.. కానీ పవన్ ఆసక్తిగా లేకపోవడంతో ‘సత్యాగ్రహి’ని ముందుకు తీసుకెళ్లలేకపోయామని రత్నం తెలిపారు. ఆ సినిమా పూర్తి చేద్దామని తాను పవన్ మీద ఒత్తిడి తేలేదన్నారు.
ఈ మధ్య పవన్ దగ్గర ఆ సినిమా ప్రస్తావన వస్తే.. మీరు కనుక నా దగ్గరికి వచ్చి ఆ సినిమా చేయాలని పట్టుబట్టి ఉంటే.. ఆమిర్ ఖాన్ లాగా తాను కూడా దర్శకుడిగా ఇలాంటి సినిమాలు తీసుకుంటూ బిజీ అయ్యేవాడినని.. అప్పుడు రాజకీయాల్లోకి కూడా వచ్చేవాడిని కాదేమో అని పవన్ వ్యాఖ్యానించినట్లు రత్నం వెల్లడించారు. అంటే ‘సత్యాగ్రహి’ మీద పవన్‌కు కూడా బాగానే గురి ఉందన్నమాట. అది హిట్టయి తాను దర్శకుడిగా బిజీ అయ్యేవాడినని ఆయన నమ్మారని భావించాలి. మరి అంత నమ్మకం ఉన్నపుడు పవన్ ఆ సినిమాను ఎందుకు పూర్తి చేయకుండా వదిలేశాడన్నదే అర్థం కాని విషయం.