మహానటితో ఎంతో గొప్ప పేరు తెచ్చుకున్నా హిట్ల కన్నా ఎక్కువ ఫ్లాపులతో ప్రయాణం చేస్తున్న కీర్తి సురేష్ కు పెళ్ళయాక కూడా ఆఫర్లు బాగానే వస్తున్నాయి. బాలీవుడ్ డెబ్యూ బేబీ జాన్ తీవ్రంగా నిరాశపరిచినా రాజ్ కుమార్ రావుతో సెక్టార్ 36లో ఛాన్స్ రావడం గురించి బాలీవుడ్ మీడియా ప్రత్యేకంగా ప్రస్తావిస్తోంది. విద్యా వ్యవస్థపై తీవ్ర విమర్శనాస్త్రంగా రూపొందబోయే ఈ సినిమాకు ఆదిత్య నింబాల్కర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో హీరోయిన్ పాత్ర ఎక్కువ పెర్ఫార్మన్స్ డిమాండ్ చేస్తుందట. అందుకే ఏరికోరి మరీ కీర్తి సురేష్ ని తీసుకున్నట్టు లేటెస్ట్ అప్డేట్. అయితే మన మ్యాటర్ దాని గురించి కాదు లెండి.
ఇటీవలే సూర్య హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో ప్యాన్ ఇండియా మూవీ మొదలైన సంగతి తెలిసిందే. సూర్యకు జోడిగా మమిత బైజుని తీసుకున్నారు. నిజానికి మొదటి ఛాయస్ గా కీర్తి సురేష్ ని అడిగారట. కానీ తను అప్పటికీ విజయ్ దేవరకొండ – రవికిరణ్ కోలా కాంబోతో దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కబోయే రౌడీ జనార్దనా కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఏదో ఒకటి మాత్రమే ఎంచుకునే పరిస్థితి వచ్చిందట. కీర్తి సురేష్ ఆల్రెడీ సూర్యతో గ్యాంగ్ చేసింది. మహానటిలో విజయ్ దేవరకొండ క్యామియో చేశాడు కానీ ఇద్దరి మధ్య కాంబినేషన్ సీన్లు లేవు. ఈ కారణంగా రౌడీ జనార్దనా వైపు మొగ్గు చూపినట్టు అర్థమవుతోంది.
అందరు స్టార్ హీరోలతో నటించాలన్న టార్గెట్ పెట్టుకున్న కీర్తి సురేష్ దానికి అనుగుణంగానే ప్లాన్ చేసుకుంటోంది. గతంలో చిరంజీవి చెల్లెలిగా భోళా శంకర్ ఆఫర్ ని సాయిపల్లవి తిరస్కరిస్తే దాన్ని కీర్తి సురేష్ అందిపుచ్చుకుంది. రజనీకాంత్ చెల్లెలిగా పెద్దన్నలో పోటీ పడి నటించింది. వీటి ఫలితాలు నిరాశపరిచినా తెలుగు తమిళ సీనియర్ స్టార్లతో నటించిన సంతృప్తి మిగిలింది. ఇక ఇప్పుడు హీరోయిన్ గా అవకాశాలు తగ్గిపోయిన తరుణంలో రౌడీ హీరో సరసన అంటే మంచి ఛాన్సే. తను టైటిల్ రోల్ పోషించిన రివాల్వర్ రీటా విడుదల కావాల్సి ఉండగా సుహాస్ తో నటించిన ఉప్పు కప్పురంబు అప్డేట్స్ ఆగిపోయాయి.